- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధి పై కేంద్రం దృష్టి...
యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధి పై కేంద్రం దృష్టి సారించిందని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు

దిశ,రాంనగర్ : యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధి పై కేంద్రం దృష్టి సారించిందని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఆర్‌టీసీ కళాభవన్ లో శుక్రవారంనిర్వహించిన ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధికి శ్రామిక శక్తి, నైపుణ్యం కలిగిన యువతే అసలైన బలమని పేర్కొన్నారు. 2020 నుంచి 2025 మధ్య 18 నుంచి 28 ఏళ్ల వయస్సు గల 3.45 కోట్లకు పైగా యువత ఫార్మల్ వర్క్‌ఫోర్స్‌లో చేరినట్లు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, రూ.99,446 కోట్ల వ్యయంతో పీఎం- విధిఆర్వై పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని వివరించారు. ఫస్ట్ టైమ్ ఎంప్లాయీలకు రూ.15,000 వరకు ప్రోత్సాహకాన్ని అందించడంతో పాటు, కొత్త ఉద్యోగాలు కల్పించే సంస్థలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా తయారీ రంగ సంస్థలకు నాలుగేళ్లపాటు ప్రత్యేక మద్దతు లభిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 25 వేలకుపైగా సంస్థలు ఈ పథకంలో నమోదు చేసుకోగా, 18 వేలకుపైగా సంస్థలు అదనపు ఉద్యోగాలను కల్పించి ప్రయోజనాలు పొందుతున్నాయని వెల్లడించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్ర యోజన వంటి కార్యక్రమాలు యువత సాధికారతకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. దేశంలో 2.2 లక్షలకు పైగా స్టార్టప్‌లు, 120కి పైగా యూనికార్న్‌లు ఏర్పడి 23 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించాయని తెలిపారు. ప్రతి కొత్త ఉద్యోగం, ప్రతి కొత్త నైపుణ్యం, ప్రతి కొత్త సంస్థ వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొంటూ, ఈ పథకంలో భాగస్వాములైన యువత, సంస్థలు, యజమానులకు అభినందనలు తెలిపారు.






