తల నరుక్కుంటానన్న కేసీఆర్ ఇప్పుడేమంటారు?

by GSrikanth |

ఎన్నికల‌ హామీలు నెరవేర్చకుంటే తల నరుకుంటామన్న కేసీఆర్ ఇప్పుడేమంటారు? అని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ ప్రశ్నించారు.

తల నరుక్కుంటానన్న కేసీఆర్ ఇప్పుడేమంటారు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల‌ హామీలు నెరవేర్చకుంటే తల నరుకుంటామన్న కేసీఆర్ ఇప్పుడేమంటారు? అని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్దికి ప్రధాని మోడీ పెద్ద మనస్సుతో సహాకరిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీపై ఎన్ని విమర్శలు చేస్తే అంత ఆశీర్వాదం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం రాష్ట్రంలో పర్యటించిన కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో హామీలు విస్మరించిందన్న ఆయన..దళిత సీఎం, మూడెకరాల భూమి, పక్కా ఇళ్ళు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రానికి దక్కలేదన్నారు. బీఆర్ఎస్‌ను ప్రజలు తరిమికొట్టే సమయం దగ్గర్లో ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఒకే కుటుంబం చేతిలో బందీగా ఉందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వెనుక పడిపోయిందన్నారు. కేంద్ర ప్రాజెక్టులకు సహకరించకుండా కేసీఆర్ సర్కార్ కేంద్రంపై నిందలు వేస్తోందన్నారు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని కేంద్రమంత్రి అన్నారు. బీఆర్ఎస్‌కు జాతీయ అధ్యక్షుడు ఎవరో కేసీఆర్ చెప్పాలి? అని డిమాండ్ చేశారు. అంతకుముందు, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చెగుర్‌కన్షా శాంతివనంలో 1600 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం గొప్పవిషయమని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.

శాంతివనంలో నిర్మించిన ఈ క్రీడా ప్రాంగణాన్ని అనురాగ్ ఠాకూర్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ప్రారంభించారు. అనంతరం కన్హా గ్రీన్ 2కే రన్‌లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఆ తర్వాత 11 దేశాలకు సంబంధించిన 22 మందికి యోగా అంబాసిడర్‭లుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఆరోగ్యానికి మెడిటేషన్‌తో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...మెంటల్ ఫిట్‭నెస్ కోసం యోగా, ఫిజికల్ ఫిట్‭నెస్ కోసం క్రీడలు రెండూ ఒకే చోట ఏర్పాటు చేయడం అద్భుతమని అన్నారు. క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. ఆటలకోసం ఇంత పెద్ద ప్రాంగణం నిర్మించడం సంతోషమని బ్యాట్మింటన్ కోట్ పుల్లెల గోపిచంద్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల పట్ల యువతను బాగా ప్రోత్సహిస్తున్నాయన్నారు. గత పదేళ్ళలో పిల్లల తల్లిదండ్రులు కూడా క్రీడల వైపు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన చెప్పారు.

Next Story