యూనివర్శిటీ భూములను కాజేసేందుకు రేవంత్​ ప్రభుత్వం కుట్రలు : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

by Ajay Maddhiboyina |

కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా యూనివర్సిటీల భూములను కాజేయడంపై మిషన్ మోడ్’లో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు.

యూనివర్శిటీ భూములను కాజేసేందుకు రేవంత్​ ప్రభుత్వం కుట్రలు : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : బడ్జెట్ కేటాయింపులు లేకుండా విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా యూనివర్సిటీల భూములను కాజేయడంపై మిషన్ మోడ్’లో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. బుధవారం ఎక్స్​వేదికగా స్పందిస్తూ.. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు పరం చేసేందుకు అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని లెక్కచేయకుండా ఆ భూమిని చదును చేసేందుకు ప్రయత్నించిందన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తే వెనక్కు తగ్గిందని పేర్కొన్నారు. తాజాగా గచ్చిబౌలిలోని ప్రఖ్యాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసిందన్నారు.

యూనివర్సిటీలోని 50 ఎకరాలను వెనక్కు తీసుకుని మళ్లీ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. యూనివర్సిటీల వద్ద భూమి ఉంటే భవిష్యత్ అవసరాలకోసం, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఉపయోగపడుతుందని, ప్రభుత్వ ఖజానాను నింపేందుకు వాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవడం యూనివర్సిటీ భూములను ఆర్థిక దోపిడీకి వాడుకోవడంపైనే రేవంత్ రెడ్డి సర్కారు ఆసక్తి చూపిస్తోంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థ, వర్సిటీల పురోగతిని మాత్రం అంధకారంలోకి నెట్టేస్తోందని మండిపడ్డారు.

Next Story