- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IASల పనితీరు తెలిసేలా స్పెషల్ డ్యాష్‌బోర్డ్.. CM, CS ఆఫీసుల్లో ఏర్పాటుకు ప్లాన్
ఐఏఎస్ అధికారుల పనితీరును తెలుసుకోవడంపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఐఏఎస్ అధికారుల పనితీరును తెలుసుకోవడంపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు. జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏఏ పనులు చేశారో తెలుసుకునేందుకు సీఎం, సీఎస్ ఆఫీసులతోపాటు ముఖ్యమంత్రి ఇంట్లో ప్రత్యేక డ్యాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విధి నిర్వహణలో కలెక్టర్లు, హెచ్ఓడీలు, సెక్రెటరీలు, చివరికి సీఎస్ సైతం ఏ రోజు, ఏ పని చేశారో ఆ డ్యాష్ బోర్డులో ఒక్క క్లిక్ తో డిస్ ప్లే అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారుల పనితీరు మెరుగవడంతోపాటు, ప్రభుత్వ పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే గుర్తించి, పరిష్కరించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.
బ్యూరోక్రాట్స్ ఇష్టారాజ్యానికి చెక్
ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయించి.. ఓ జిల్లా కలెక్టర్ ప్రతి రోజు ఏం చేస్తున్నారో సీఎంకు డైరెక్ట్ గా తెలుసుకునే అవకాశం ఇప్పటి వరకు లేదు. అలాగే ఓ శాఖ హెచ్ఓడీ, ఓ శాఖ సెక్రెటరీ డెయిలీ ఏయే పనులు చేస్తున్నారో నేరుగా తెలుసుకునే చాన్స్ కూడా లేదు. దీంతో చాలా మంది బ్యూరోక్రట్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం పదే పదే ఆదేశించినా.. కలెక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే హెచ్ఓడీలు, సెక్రెటరీలు రోజుల కొద్దీ ఫైల్స్ తమ వద్ద పెట్టుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫైల్ ను క్లియర్ చేయకుండా, అలాగని రిజెక్ట్ కూడా చేయకుండా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటినీ చెక్ పెట్టేందుకే డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎస్ రామకృష్ణారావు భావిస్తున్నట్లు తెలిసింది.
బటన్ నొక్కితే ‘పర్ఫార్మెన్స్’ డిస్ ప్లే
ఓ జిల్లా కలెక్టర్ తన డ్యూటీలో భాగంగా ముందు రోజు ఏం పనులు చేశారో తెలుసుకునేందుకు డ్యాష్ బోర్డులో ఆ జిల్లా పేరుపై క్లిక్ చేస్తే.. ఆ కలెక్టర్ పనితీరు మొత్తం తెలిసిపోతుంది. అలాగే హెచ్ఓడీ, సెక్రెటరీ స్థాయి అధికారుల పనితీరు మొత్తం తెలుసుకోవచ్చు. దీంతో పని చేస్తున్న అధికారులు ఎవరు? అని ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా సరిగా పనిచేయకపోతే.. వారితో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎంత వేగంగా ఉంది? ఏ స్కీమ్, ఏ జిల్లాలో, ఎక్కడి వరకు వచ్చింది? అని రెగ్యులర్ గా మానిటరింగ్ చేయవచ్చు. దీంతో సమస్యలను వెంటనే పరిష్కరించే వెసులుబాటు ప్రభుత్వానికి లభిస్తుంది.
డెయిలీ రిపోర్ట్
కలెక్టర్, హెచ్ఓడీ, సెక్రెటరీ వరకు ఒకరోజులో ఏం పనులు చేశారో డ్యాష్ బోర్డు కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక వెబ్ సైట్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓ జిల్లా కలెక్టర్ ఫీల్డ్ విజిట్ కు (డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, గురుకులాలు, స్కూల్స్ తనిఖీలు) వెళ్తే ఆ వివరాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షలు చేస్తే.. ఆ వివరాలను వెబ్ సైట్ లో నమోదు చేయాలి. హెచ్ఓడీ స్థాయి ఐఏఎస్ అధికారి తన శాఖ పరిధిలో ఒకరోజులో ఏం పనులు చేశారో, ఎన్ని ఫైల్స్ ప్రభుత్వానికి పంపారో.. వాటిని కూడా వెబ్ సైట్ లో ఎంట్రీ చేయాలి. అలాగే ఓ శాఖ సెక్రెటరీ తన వద్దకు ఒకరోజులో ఎన్ని ఫైల్స్ వచ్చాయి? ఎన్ని క్లియర్ అయ్యాయి? ఎన్ని సీఎస్ ఆమోదం కోసం వెళ్లాయి? ఎన్ని పెండింగ్ లో పడ్డాయి? ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఒకవేళ వెనక్కి పంపితే ఎందుకు పంపారు? అనే వివరాలను వెబ్ సైట్ లో నమోదు చేసే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు.
సీఎస్ సైతం..
చీఫ్ సెక్రెటరీ సైతం తన వద్దకు ఏ శాఖకు చెందిన ఫైల్స్ వచ్చాయి? ఎన్నింటిని క్లియర్ చేశారు? ఎన్ని పెండింగ్ లో పడ్డాయి? ఎన్ని సీఎం ఆమోదం కోసం వెళ్లాయి? అనే వివరాలను డ్యాష్ బోర్డు కోసం ఏర్పాటు చేసే వెబ్ సైట్ లో ఎంట్రీ చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. డ్యాష్ బోర్డు మానిటరింగ్ మొత్తం సీఎస్ ఆఫీసు కేంద్రంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఆ వెబ్ సైట్ లో వచ్చిన వివరాలను ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో అప్ డేట్ చేసేందుకు ఓ అధికారి నేతృత్వంలో ఇద్దరు, ముగ్గురు టెకీలతో ఓ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.






