15 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాహన సంబంధిత సేవలను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ అమలు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది.

15 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాహన సంబంధిత సేవలను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ అమలు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ ద్వారా పారదర్శకమైన సేవలు అందించేందుకు రవాణా శాఖ దశలవారీగా చర్యలు చేపడుతోంది. ఈనెల 23 వరకు అందిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా వాహన్ ప్లాట్‌ఫామ్ ద్వారా 68,846 తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) పూర్తయ్యాయి. అలాగే, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అందుబాటులోకి తెచ్చిన ఫ్యాన్సీ నంబర్ మాడ్యూల్ ద్వారా ఇప్పటివరకు 1,880 ఆన్‌లైన్ రిజర్వేషన్లు నమోదయ్యాయి. వీటితో పాటు 23,705 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్లను కేటాయించినట్లు రవాణా శాఖ వెల్లడించింది.

మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి పటిష్ఠత...

కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన ప్రారంభంలో వెరిఫికేషన్, ఇన్‌స్పెక్షన్ స్థాయిల్లో కొంత పెండింగ్ ఉన్నప్పటికీ, నిరంతర పర్యవేక్షణ ద్వారా వాటిని వేగంగా పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం వ్యవస్థ పనితీరు మెరుగుపడిందని, ఆమోద ప్రక్రియ వేగవంతమైందని అధికారులు తెలిపారు. సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ వాహన్ పోర్టల్‌ను పటిష్టం చేస్తున్నామని.. వచ్చే 15 రోజుల్లో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. వాహన్ పోర్టల్ లో సాంకేతిక సమస్యల వల్ల కాస్త ఆలస్యంగా సేవలు అందుతున్నా.. సహకరిస్తున్న వాహన డీలర్లు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పౌరులకు మెరుగైన డిజిటల్ సేవలును అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Next Story