ఆరోగ్య 'సిబ్బందికి ఆత్మ' రక్షణ.. హెల్త్‌కేర్ ఉద్యోగులపై హింసను అరికట్టేలా ప్రత్యేక చట్టం

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు సహా అన్ని రకాల హెల్త్‌కేర్ ఉద్యోగులపై జరిగే హింసను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హెల్త్‌కేర్ వర్కర్స్ అండ్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ప్రొటెక్షన్ చట్టం-2025ను అమల్లోకి తీసుకొచ్చింది.

ఆరోగ్య సిబ్బందికి ఆత్మ రక్షణ.. హెల్త్‌కేర్ ఉద్యోగులపై హింసను అరికట్టేలా ప్రత్యేక చట్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు సహా అన్ని రకాల హెల్త్‌కేర్ ఉద్యోగులపై జరిగే హింసను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హెల్త్‌కేర్ వర్కర్స్ అండ్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ప్రొటెక్షన్ చట్టం-2025ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని వైద్య సంస్థలకు వర్తించనుంది. వైద్య విధుల్లో ఉన్న సమయంలో ఆస్పత్రులలో, బయట కానీ శారీరక, మానసిక, మాటల దాడులు, విధులకు అడ్డంకులు, ఆస్తి నష్టం వంటి చర్యలను హింసగా పరిగణించి కఠిన శిక్షలు విధించనున్నారు. ఈ చట్టం కింద నమోదయ్యే నేరాలు కాగ్నిజబుల్, నాన్‌బెయిలబుల్ పరిధిలోకి వస్తాయి. వైద్య సిబ్బంది లేదా వైద్య సంస్థలపై హింస జరిగిన సందర్భంలో పోలీసులు ముందస్తు అనుమతి లేదా కోర్టు ఆదేశాలు లేకుండానే వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టవచ్చు. అలాగే ఈ కేసుల్లో నిందితులకు సులభంగా బెయిల్ కూడా లభించదు. న్యాయస్థానం పరిశీలన అనంతరం మాత్రమే బెయిల్ అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. హింస జరిగిన ఘటనపై ఆస్పత్రులు 6 గంటల్లోపు ఫిర్యాదు చేయాల్సి ఉండగా.. పోలీసులు 1 గంటలోపే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి, ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా ఏడాదిలోపు విచారణ ముగించాల్సిందేనని చట్టం చెబుతుంది.

కనీసం 6 నెలలు.. గరిష్ఠం 5 ఏళ్ల జైలు శిక్ష..

హెల్త్‌కేర్ వర్కర్స్ అండ్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ప్రొటెక్షన్ చట్టం-2025 ప్రకారం కనీసంగా 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. తీవ్రంగా గాయపరిస్తే 3 నుంచి పదేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆస్పత్రి ఆస్తి నష్టం జరిగిన పక్షంలో దాని విలువకు రెట్టింపు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా గాయాలకు రూ.1 లక్ష, తీవ్రమైన గాయాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.

ఆస్పత్రులన్నీ సేఫ్ జోన్స్..

ఈ చట్టం ప్రకారం ఆస్పత్రులన్నీ ఇకపై సేఫ్ జోన్లుగా ప్రకటించనున్నారు. సీసీటీవీ కెమెరాలు, శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది, యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలు తప్పనిసరి చేశారు. ఆస్పత్రుల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు, సిబ్బందికి డీ-ఎస్కలేషన్, క్రైసిస్ మేనేజ్‌మెంట్ శిక్షణ ఇవ్వడం అనివార్యంగా మార్చారు. మహిళా సిబ్బందికి రాత్రి విధుల సమయంలో సురక్షిత రవాణా, ప్రత్యేక విశ్రాంతి గదులు కల్పించాలి. బాధిత సిబ్బందికి మానసిక, ఆరోగ్య సహాయం అందించాలని చట్టం సూచిస్తోంది. వైద్యులు చికిత్స విధానం, ప్రమాదాలు, ఖర్చులు స్పష్టంగా వివరించి రోగులు, వారి బంధువుల నుంచి సమ్మతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. అత్యవసర పరిస్థితుల్లో సమ్మతి పేరుతో చికిత్స ఆలస్యం చేయరాదు. తప్పుడు ఫిర్యాదులు చేస్తే శిక్షలు తప్పవని చట్టంలో ఉంది.

ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో హెల్త్‌కేర్ ప్రొటెక్షన్ బోర్డులు, జిల్లాస్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి అమలును పర్యవేక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసి రాష్ట్రాల పనితీరును పర్యవేక్షించనుంది. మొత్తంగా, వైద్య రంగంలో హింసకు పూర్తిస్థాయి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే హాస్పిటల్స్ యాజమాన్యాలకు, వైద్యులు, సిబ్బందికి మాత్రమే కాకుండా రోగులు, వారి బంధువులకు సైతం అండగా చట్టం అండగా నిలువనుంది.

Next Story