సమ్మక్కసాగర్‌కు కేంద్రం ఓకే

by Naga Rani Yarlagadda |

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమ్మక్కసాగర్‌కు అనుమతుల కోసం శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నది.

సమ్మక్కసాగర్‌కు కేంద్రం ఓకే
X
  • ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక చర్చ
  • ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌వోసీ ఇస్తే అనుమతులకు లైన్ క్లియర్
  • కేంద్రం అనుమానాలు నివృత్తి చేసిన అధికారులు

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమ్మక్కసాగర్‌కు అనుమతుల కోసం శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నది. ఆ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. అయితే.. తాజాగా సీడబ్ల్యూసీ మీటింగులోనూ కేంద్రం అదే పాజిటివ్ వైఖరిని చూపించినట్లు అధికారులు చెప్పారు. సమ్మక్క ప్రాజెక్టు ప్రతిపాదనలపై సీడబ్ల్యూసీ సంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు. కేంద్రం అధికారులు తెలిపిన అనుమానాలను నివృత్తి చేసినట్లు చెప్పారు. వారు తెలిపిన పలు అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. అయితే.. రాష్ట్ర అధికారులు తెలిపిన సమాధానాలకు సీడబ్ల్యూసీ పాజిటివ్‌గా స్పందించినట్లు అధికారులు చెప్పారు.

ఛత్తీస్‌గఢ్ ఎన్‌వోసీపైనే ఆధారం

ములుగు జిల్లాలో రూ.9,257 కోట్లతో గోదావరిపై తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పనులు దాదాపు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యం. అయితే.. గత ప్రభుత్వం చేసిన తప్పిదంతో ప్రాజెక్టుకు అనుమతులు రాకుండా ముందుకు కదల్లేదు. ప్రాజెక్టు ప్రయోజనాలు వ్యయాల మధ్య నిష్పత్తిని 1.67:1గా ఉంటే.. ప్రాజెక్టుపై రూపాయి వెచ్చిస్తే రూ.1.67 రాబడి వస్తుందంటూ డీపీఆర్‌లో చేర్చారు. మెరుగైన వ్యయ నిష్పత్తిని చూపేందుకే ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్టు స్థిరీకరణను సైతం సమ్మక్క ప్రాజెక్టు ఖాతాలో చేర్చగా.. కేంద్ర జల సంఘం పరిశీలనలో దొరికిపోయింది. వాస్తవానికి ఎస్సారెస్పీ రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమ్మక్కసాగర్ ప్రాజెక్టు కింద స్థిరీకరిస్తామని గత ప్రభుత్వం డీపీఆర్‌లో చేర్చింది. అయితే.. 4.40 లక్షల ఎకరాల ఆయకట్టునే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద సైతం స్థిరీకరిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సీడబ్ల్యూసీ అభ్యంతరం చెప్పింది. ఒకే ఆయకట్టును ఎస్సారెస్పీ 2, కాళేశ్వరం, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుల కింద ఎలా చూపిస్తారంటూ వివరణ రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. దాంతో సమ్మక్కసాగర్ అనుమతులకు కాస్త బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్టు అనుమతులు సాధించాలంటే కొత్తగా 2 లక్షల ఎకరాల ప్రత్యేక ఆయకట్టును ప్రతిపాదించగా.. దానికి ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలని సీడబ్ల్యూసీ సూచించింది. అందులోభాగంగానే ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ రాష్ట్ర సీఎంతో భేటీ అయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఉద్దేశాలను ఆయనకు వివరించారు. అంతేకాకుండా.. ఆ రాష్ట్రంలో జరుగుతున్న నష్టానికి పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించేందుకు అంగీకరించారు. దాంతో అక్కడి సీఎం ఎన్‌వోసీ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే.. అక్కడి ప్రభుత్వం ఎన్‌వోసీ ఇచ్చిన వెంటనే సీడబ్ల్యూసీ నుంచి సైతం మిగిలిన అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం నాటి సమావేశంలోనూ కేంద్రం అధికారులు అదే విషయాన్ని వెల్లడించారు. నెల రోజుల్లో ముంపు పరిహారం తేలితే.. మరో నెలరోజుల్లో సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లతో పాటు టీఏసీ అనుమతి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Next Story