‘చిన్న’ వారికి అండగా ముద్ర.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-10 06:17:08  IST  )

ప్రధాని మోడీ 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎమ్ఎంవై) చిన్నవారికి అండగా నిలుస్తున్నదని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు.

‘చిన్న’ వారికి అండగా ముద్ర.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎమ్ఎంవై) చిన్నవారికి అండగా నిలుస్తున్నదని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. కార్పొరేటేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామిక వేత్తల కోసం రూ.10 లక్షల వరకు రుణాలను అందిస్తుండడం గొప్ప విషయమని తెలిపారు. సేవారంగాల్లో ఆదాయాన్ని ఆర్జించే చిన్న వ్యాపార సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలను అందించేలాఈ పథకాన్ని రూపొందించారని పేర్కొన్నారు. పీఎమ్ఎంవై కింద, టర్మ్‌లోన్లు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు రెండింటినీ కవర్‌ చేస్తూ, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు సహా మెంబర్ లైండింగ్ ఇనిస్టిట్యూషన్స్ ఈ రుణాలను అందిస్తున్నాయని తెలిపారు. ప్రారంభంలో, శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు వర్గాల కింద ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించారని.. ఈ పథకం విజయవంతం అయింది.

దీంతో ‘తరుణ్’ కేటగిరీ కింద గతంలో రుణాలు తీసుకుని వాటిని విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారుల కోసం ప్రభుత్వం ‘తరుణ్ ప్లస్’ అనే కొత్త కేటగిరీని జోడించింది. అలాగే.. రుణపరిమితిని రూ.20 లక్షలకు పెంచిందని పేర్కొన్నారు. పీఎమ్ఎంవై ప్రారంభంతో ప్రజలు బ్యాంకుకు పూచీకత్తుగా ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే రుణాలను పొందగలిగారని తెలిపారు. దీనివల్ల సమాజంలో అణగారిన, బలహీనవర్గాలకు ప్రయోజనం చేకూరిందని, పెద్ద సంఖ్యలో గ్రామీణ మహిళలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారికి సులభంగా రుణం అందించడమే కాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ పథకం ద్వారా 52 కోట్లకుపైగా రుణాలు మంజూరయ్యాయని, వీటి విలువ రూ.33.54 లక్షల కోట్లు అని తెలిపారు.

Next Story