- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రాన్ని విస్మరించిన కేంద్ర బడ్జెట్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా దేశాభివృద్ది, రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా దేశాభివృద్ది, రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు, వడ్డీలు కట్టాల్సి వస్తున్నదని తెలిపారు. పని దినాలు పెంచామని చెప్పినప్పటికీ ‘విబి జిరాంజి’ పథకానికి కేవలం రూ.93 వేల కోట్లు కేటాయించి గతంతో పోలిస్తే కోత పెట్టారని విమర్శించారు. వ్యవసాయ రంగానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి నిధులు తగ్గించారని, ఈ రంగాలకు గతంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేయలేదన్నారు. దేశ కార్పొరేట్ సంస్థలైన ఆదానీ, అంబానీ తదితరులకు డేటా సెంటర్ల పేరుతో రాయితీలు ప్రకటించారని, సంక్షేమ పథకాలు, ఎరువుల రాయితీలు, చిన్న పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదు. ఉద్యోగులకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచకుండా నిరాశపర్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వాటాగా రావాల్సిన నిధులు తగ్గించారని, పన్నుల వాటాలో 2.11 శాతం ప్రకారం రూ.63 వేల కోట్లు రావాల్సిందని, గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.4 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. జీఎస్టీ పన్నుల వల్ల ఇప్పటికే రాష్ట్రాలు ఆర్ధికంగా సతమతమవుతుంటే పన్నుల వాటాను తగ్గించడం శోచనీయమన్నారు. పాలమూరు, రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా యివ్వాలని కోరుతున్నా వాటి ఊసే లేదన్నారు. హైదరాబాదు మెట్రో రైల్‌ను విస్తరణకు నిధులు ఇవ్వలేదని, ఫార్మా రంగానికి అవసరమైన నిధులు కేటాయించలేదని, విద్యా, వైద్య రంగాలు పూర్తిగా కార్పొరేట్ మయమవుతున్న పరిస్థితుల్లో పేదలకు ఆ రంగాలు అందుబాటులోకి తేవడానికి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని తెలిపారు. రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలు, మంత్రులు ఉన్నప్పకీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో విఫలమయ్యారని అన్నారు.
తెలంగాణను వంచించిన కేంద్ర బడ్జెట్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
రాష్ట్రానికి సంబంధించిన విభజన మామీలకు ఎలాంటి కేటాయిపులు, ప్రకటనలు చేయకుండా కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు య అన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అవుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలు స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌కు మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు, రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టు జాతీయ హోదా, కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు ప్రకటన డిమాండ్స్‌ను బడ్జెట్‌లో విస్మరించారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్య నిరుద్యోగం, ఆర్థిక అంతరాలకు సంబంధించి ఏలాంటి పరిష్కారం చూపలేదని సాంబశివరావు మండిపడ్డారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి పేదలకు ఉపశమన ఇవ్వకపోగా, కార్పొరేట్స్‌కే అనుకూలంగా ఉన్నదని అన్నారు. మూలిగే నక్కపై తాటి పండులాగా ఇప్పటికే రుణాలు, ఆర్థిక భారాలతో సతమతమవుతున్న రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి ‘జిరామ్‌జి’ పథకం ద్వారా రాష్ట్రాలకు 40 శాతం భారాన్ని వేయడం సరికాదన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటాను కేటాయించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తమ పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపడం పట్ల రాష్ట్రం నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.
కార్పొరేట్ల బడ్జెట్ : సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని, పేద, మధ్యతరగతి ప్రజలకు నిరాశజనకంగా ఉందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తకపోవడం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిలేమికి నిదర్శనమని అన్నారు. వ్యవసాయ ఆధారిత దేశంలో, రైతుల సంక్షేమాన్ని కేంద్రం గాలికి వదిలేసింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. ఎరువుల సబ్సిడీలలో కోత విధించడం నల్లగొండ వంటి వ్యవసాయ ఆధారిత జిల్లాల రైతులపై పెనుభారం పడుతుందన్నారు. పోచంపల్లి, నారాయణపూర్, పుట్టపాక వంటి ప్రాంతాల్లోని చేనేత కార్మికులు ఎప్పటినుండో కోరుతున్నట్లుగా, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయకపోవడం శోచనీయమన్నారు. ముడి సరుకుల ధరలు పెరిగి నేతన్నలు ఇబ్బంది పడుతుంటే, బడ్జెట్‌లో వారికి ఎలాంటి ఊరట కల్పించలేదన్నారు.






