- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రీజినల్ రింగ్ రైల్వే లైన్ అప్డేట్.. దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం
ట్రిపులార్‌ను ఆనుకునే రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రిపులార్‌ను ఆనుకునే రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. రీజినల్ రింగ్ రోడ్డు కోసం సుమారు వంద మీటర్లతో భూసేకరణ చేస్తుండగా.. రైల్వే లైన్ కోసం 50 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేశాయి. ఉత్తర, దక్షిణ భాగాలు కలిపితే సుమారు 400 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ట్రిపుల్ ఆర్ పక్కనే ఏర్పాటు చేస్తే వచ్చే సాంకేతిక సమస్యలు, వాటిని అధిగమించేలా పరిష్కార మార్గాలపై రైల్వే శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీని కోసం రాష్ట్ర రవాణా, ఆర్ అండ్ బీ శాఖల అధికారులతో రైల్వే ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి ప్రయత్నాలతో..
రీజినల్ రింగ్ రైల్వే లైన్ రాష్ట్రానికి ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో రీజినల్ రింగ్ రోడ్డు వెంబడే రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు. పలుమార్లు వినతిపత్రాలు సైతం అందించారు. ఇలా చేస్తే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని వివరించారు. రీజినల్ రింగ్ రైల్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కోరారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లగా.. రీజినల్ రింగ్ రైల్ ఏర్పాటు చేయాలని మరోసారి కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. రీజినల్ రింగ్ రైలుకు సంబంధించిన ప్రక్రియలో వేగం పెంచాలని రైల్వే జీఎంను ఆదేశించారు. రీజినల్ రోడ్డు వెంబడే రైల్వే లైను వచ్చే విధంగా చూడాలని సూచించారు.
రైల్వే, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ సమావేశాలు
కేంద్రమంత్రి ఆదేశాల నేపథ్యంలో స్పందించిన రైల్వే జీఎం.. రాష్ట్రానికి చెందిన రవాణా, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో రెండు సార్లు సమావేశమయ్యారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు, మార్గం గురించి సమగ్ర వివరాలను తీసుకున్నారు. రైల్వే లైన్ ఏ విధంగా వేయొచ్చు? భూ సేకరణ ఎంత అవసరం? తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ట్రిపుల్ ఆర్ వెంబడి రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. రైల్వే లైన్, రైల్వే స్టేషన్లు, లైన్ల అనుసంధానం, జంక్షన్లు తదితర విషయాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. వచ్చే వారం మరో సారి రైల్వే, రాష్ట్ర రవాణా, ఆర్ అండ్ బీ శాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. వీరి చర్చల అనంతరం భూ సేకరణ, ఇతర అంశాలపై కాస్త స్పష్టత వచ్చే అవకాశముంది.
50 మీటర్ల వెడల్పుతో..
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కోసం 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించారు. దక్షిణ భాగంలో కూడా ఇదే విధానంలో భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రీజినల్ రింగ్ రైల్వే లైనుకు కనీసం 50 మీటర్లు వెడల్పుతో ఉత్తర, దక్షిణ భాగాల్లో భూ సేకరణ అవసరం అవుతుందని అంచనాకు వచ్చారు. దీంతోపాటు రైల్వే స్టేషన్లు, జంక్షన్ల వద్ద అదనంగా భూమి అవసరం ఉంటుంది. అయితే ట్రిపుల్ ఆర్ వెంబడి రైల్వే లైన్ ఏర్పాటు చేయడంలో పలు సందేహాలను రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఎత్తు ఎక్కువ అవసరం ఉంటుందని, రైల్వే లైనుకు అలా అవసరం లేదని, ఇలా రెండింటినీ పక్కపక్కనే ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అనే అంశాలపై రైల్వే శాఖ అధికారులు సాంకేతికంగా అధ్యయనం చేస్తున్నారు. కాగా, రైల్వే లైను వేయడం దాదాపుగా ఖరారైందని, దానిని ఏ విధంగా సాధ్యం చేయాలనే దానిపైనే అధ్యయనం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. ఉత్తర, దక్షిణ భాగాలు కలిపితే రీజినల్ రింగ్ రైల్వే లైన్ దాదాపుగా 400 కిలోమీటర్ల అవుతుంది. ట్రిపుల్ ఆర్ వెంబడే రైల్వే లైను వేస్తే.. ఆ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ లైన్ వెళ్లే ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల రూపు రేఖలు రాబోయే రోజుల్లో పూర్తిగా మారుతాయని విశ్లేషిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.






