నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఫోకస్..! కమిషన్ ​ఏర్పాటు, మార్గదర్శకాలపై వర్కవుట్

by Kema Shiva Kumar |

నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది.

నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఫోకస్..! కమిషన్ ​ఏర్పాటు, మార్గదర్శకాలపై వర్కవుట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన రోడ్ మ్యాప్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు పలు రకాల కీలక ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తుందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. 2029 లోక్‌సభ ఎన్నికలను నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే నిర్వహించాలని కృతనిశ్చయంతో ఉందని సమాచారం. ఈ మేరకు మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించనున్నారు. మహిళా రిజర్వేషన్​బిల్లులో 2026 తర్వాత జరిగే మొదటి జనగణన లెక్కల తరువాత ఈ బిల్లును చట్టసభల్లో అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. అదే విధంగా నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోనూ ప్రస్తుతమున్న నియోజకవర్గాలు 2026 వరకు అమల్లో ఉంటాయని, 2026 తరువాత జరిగే జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. ఇలా నియోజకవర్గాలు, మహిళా బిల్లు రెండింటినీ అమలు చేయడానికి కేంద్రం ప్రస్తుత ప్రారంభమైన జనాభా లెక్కలను -2027గా పేర్కొన్నది. దీనితో రెండింటినీ అమలు చేయడానికి అవకాశం దొరికింది. ఎస్సీ, ఎస్టీ జనాభా దేశవ్యాప్తంగా పెరిగిందని, కొత్త నియోజకవర్గాల పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జనాభా లెక్కలు పూర్తయ్యాకే..

రాష్ట్రాల్లో అసెంబ్లీల సీట్లు, లోక్‌సభ సీట్లు ఏ రకంగా ఉండాలనే దానిపై పలు రకాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. జనాభా నియంత్రణ కారణంగా తమకు నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరుగుతుందని దక్షణాది రాష్ట్రాలు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో దక్షిణాదికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారి ఆందోళనను కూడా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లుగా తెలిసింది. అయితే, దానికి ఏ విధంగా పరిష్కారం చూపాలి? అదే సమయంలో దేశంలో జనాభా పెరుగుతున్నందున ఒక్కొ నియోజకవర్గంలో ఎక్కువ జనాభా లేకుండా ఏ విధంగా చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత దాని ఆధారంగానూ పలు ప్రతిపాదనలు పరిశీలించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది.

నియోజకవర్గాల పెంపుతోనే ఎన్నికలకు..

కమిషన్​ ఏర్పాటు, దానికి సంబంధించిన మార్గదర్శకాలపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 2027 జనాభా లెక్కల పూర్తయ్యే నాటికి కమిషన్ ఏర్పాటు, దాని మార్గదర్శకాలు, తదితర వాటిని సిద్ధం చేసి ఉంచాలనే ఆలోచనతో కేంద్రం ఉన్నట్లుగా తెలిసింది. దీనిద్వారా జనాభా లెక్కల నివేదికలు అందగానే పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ 2029లోనే లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలిసింది. దీనితో అధికారులు ఇప్పటి నుంచే అంతర్గతంగా కసరత్తు మొదలు పెట్టారని ఢిల్లీ అధికారికవర్గాల ద్వారా తెలిసింది.

2028 చివరికల్లా పునర్విభజన పూర్తి..

పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. దీనితో చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెద్దఎత్తున పెరగనుంది. అందుకు 2026లో నేషనల్ డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని కమిషన్‌కు చైర్మన్‌గా నియమించనున్నారు. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత పునర్విభజన ప్రక్రియ వేగవంతం కానుంది. 2028 చివరి కల్లా నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి ఇవ్వనున్నారు. దాని ఆధారంగా ఎన్నికల కమిషన్​ఓటరు జాబితా.. ఎన్నికల రిటర్నింగ్​అధికారుల మార్పులు చేర్పులు జరగనున్నాయి. పోలింగ్​ కేంద్రాల సంఖ్య, సగటు ఓటర్ల సంఖ్యను సరిచూసుకోవాల్సి ఉంటుంది. గత పునర్విభజన కమిషన్‌ను​2002 జులై 12న ఏర్పాటు చేశారు. మొదట ఈ కమిషన్‌ను 1991 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టారు.

అయితే, 2001 జనాభా లెక్కలు పూర్తయినందున వాటిని పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని విపక్షాలు.. ఎస్సీ, ఎస్టీల నుంచి ఒత్తిడి వచ్చింది. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగినందున తమ వర్గాలకు సీట్లు పెరుగుతాయని వాదించారు. దీంతో 2004 లోక్‌సభ ఎన్నికలకు అమలు కావాల్సిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కాస్త 2009 లోక్‌సభ ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చింది. 2002లో ఏర్పాటైన ఈ కమిషన్​నివేదికను 2008 ఫిబ్రవరి 19న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్​ ఆమోదించారు. 2008 పునర్విభజన తర్వాత దేశంలో మొదటగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి పునర్విభజన చట్టంలో 2026 తరువాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 2027 జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే గెజిట్​జారీ అయ్యింది. శాంపిల్​సర్వే సైతం ప్రారంభమైంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో హౌస్‌హోల్డ్​సర్వే చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనగణనను పూర్తి చేయనున్నారు. అనంతరం 6 నెలల తరువాత జనాభా ప్రాథమిక లెక్కలు అందుబాటులోకి వస్తాయి. వాటి ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభం కానుంది. అప్పటికల్లా నియోజకవర్గాల పునర్విభజన కమిషన్, మార్గదర్శకాలు, ప్రాథమిక కసరత్తును పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

Next Story