ఆమె ప్రతి పాట ఒక సౌందర్యం: ఆశా భోస్లే బహుముఖ ప్రజ్ఞను కొనియాడిన మెగాస్టార్

by Gantepaka Srikanth |

భారతీయ సంగీత సామ్రాజ్ఞి, లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మృతి పట్ల సినీ, రాజకీయ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.

ఆమె ప్రతి పాట ఒక సౌందర్యం: ఆశా భోస్లే బహుముఖ ప్రజ్ఞను కొనియాడిన మెగాస్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ సంగీత సామ్రాజ్ఞి, లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మృతి పట్ల సినీ, రాజకీయ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్ల మందిని అలరించిన ఆమె ఇక లేరన్న వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆశా భోస్లే మరణంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భారతీయ సినిమా ఒక అమూల్యమైన సింగర్‌ను కోల్పోయింది. ఆశా భోస్లే గారి గాత్రం తరతరాలుగా ఎన్నో భావోద్వేగాలను మోసింది. ఆమె ప్రతి పాటకు ఒక ప్రత్యేకమైన సౌందర్యాన్ని తీసుకొచ్చారు. ఆమెలోని బహుముఖ ప్రజ్ఞను నేను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను." అని కొనియాడారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఆశా భోస్లే మృతికి సంతాపం ప్రకటించారు. "దేశం గర్వించదగిన గాయని ఇక లేరనే వార్త చాలా విచారకరం. ఆశా భోస్లే గారు దేశంలోని అనేక భాషల్లో పాటలు పాడి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి." అని ఆయన పేర్కొన్నారు.

తరతరాల పాటు ఆమె పాటలు నిలిచిపోతాయి: జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆశా భోస్లే మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "దశాబ్దాల పాటు భారతీయ సినిమాలకు ఆశా భోస్లే గారు ప్రాణంగా నిలిచారు. పరిశ్రమలో తరతరాల పాటు నిలిచిపోయే అద్భుతమైన పాటలను మనకు అందించి వెళ్లారు." అని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె ఆలపించిన వేల కొద్దీ గీతాల రూపంలో ఆశా భోస్లే చిరకాలం జీవించే ఉంటారని అభిమానులు, ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

Next Story