- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుస్నాబాద్‌లో అభివృద్ధి సంబురం!
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని విద్యా, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో రాష్ట్రంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అన్నారు.

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని విద్యా, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో రాష్ట్రంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మంత్రులు విస్తృతంగా పర్యటించి పలు ప్రతిష్ఠాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో రూ. 45.15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అధునాతన సాంకేతిక కేంద్రం (ATC) భవన నిర్మాణ పనులకు వారు భూమిపూజ చేశారు. అనంతరం తిరుమల గార్డెన్‌లో ఉపాధి, శిక్షణ శాఖ ‘టామ్‌కామ్’ (TOMCOM) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విదేశీ మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ మేళాకు వివిధ గ్రామాల నుంచి సుమారు 1,500 మంది నిరుద్యోగ యువతీయువకులు తరలివచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామన్నారు. రూ. 4,500 కోట్లతో రాష్ట్రంలో మొత్తం 120 కేంద్రాలను ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. ఈ కేంద్రాల ద్వారా ప్రొడక్ట్ డిజైన్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV) వంటి ‘ఇండస్ట్రీ 4.0’ అధునాతన కోర్సులలో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తామన్నారు. హుస్నాబాద్ కేంద్రంలో ఏటా 288 మందికి ప్రవేశం కల్పిస్తామని, ప్రతి శిక్షణార్థికి నెలకు రూ. 2,000 స్టైపెండ్, ఉచితంగా రెండు జతల యూనిఫాంలు అందజేస్తామని వివరించారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్‌లో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు త్వరలోనే 250 పడకల ఆసుపత్రి, పీజీ మెడికల్ కాలేజీ రాబోతున్నాయన్నారు. విదేశాల్లో డ్రైవర్ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి హుస్నాబాద్‌కు డ్రైవింగ్ స్కూల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ ప్రత్యేకంగా జర్మన్ భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, నేర్చుకునే వారికి వ్యక్తిగతంగా నెలకు రూ. 1,000 స్టైపెండ్, ఉచిత అల్పాహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల కోసం ప్రభుత్వం రూ. 220 కోట్లు కేటాయించిందని, కేవలం 14 మంది రైతుల కోర్టు కేసుల వల్ల 70 వేల మంది రైతులకు అన్యాయం చేయవద్దని సదరు రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూసిన నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పటికే లక్ష ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బడ్జెట్‌లో టామ్‌కామ్‌కు రూ. 90 కోట్లు కేటాయించామని, యువతకు నైపుణ్యాలు, భాష నేర్పించి విదేశాలకు పంపుతామన్నారు. విదేశాల్లో లక్షల జీతాలతో కూడిన 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, యువత కేవలం స్థానిక ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో క్రాంతి వెస్లీ, సీపీ రష్మీ పెరుమాళ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, టామ్‌కామ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






