పత్తి కొనుగోలులో సీసీఐ చిచ్చు

by Ajay Maddhiboyina |

పత్తి కొనుగోళ్లపై సీసీఐ తీసుకొచ్చిన ఎల్1, ఎల్​2 నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారని, వీలైనంత త్వరగా రాష్ట్రంలో అన్ని జిన్నింగ్ మిల్లులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్​సింగ్​ కార్యాలయం అధికారులను వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు.

పత్తి కొనుగోలులో సీసీఐ చిచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పత్తి కొనుగోళ్లపై సీసీఐ తీసుకొచ్చిన ఎల్1, ఎల్​2 నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారని, వీలైనంత త్వరగా రాష్ట్రంలో అన్ని జిన్నింగ్ మిల్లులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్​సింగ్​ కార్యాలయం అధికారులను వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. సీసీఐ విధించిన ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితిని కూడా వెంటనే ఎత్తివేసి, ఎకరానికి 12 క్వింటాళ్ల పరిమితితో కొనుగోళ్లు జరిపేలా చొరవ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర రైతులు ఇప్పటికే అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీసీఐ తీసుకొచ్చిన తేమశాతం, ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి అనే నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే కేంద్రం జౌళిశాఖ మంత్రికి, సీసీఐ ఎండి లేఖలు రాశామని, అయినప్పటికి కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదని, దీంతో జిన్నింగ్ మిల్లర్లు సమ్మె చేస్తామన్నారని తెలిపారు.

సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలతో తాము పత్తికొనుగోళ్లు నిలిపివేస్తామని జిన్నింగ్​మిల్లర్లు హెచ్చరించడంతో ఆదివారం మంత్రి స్పందించి నిబంధనలు తొలగించాలని పేర్కొన్నారు. కేంద్ర జౌళిశాఖ అధికారులు కోరినట్టుగా, జిల్లా వారి సరాసరి పత్తి దిగుబడి గణాంకాలను తయారుచేయడం జరిగిందని తెలిపారు. కావాలంటే రైతు వారీ గణాంకాలు కూడా అందచేస్తామని చెప్పారు. రాష్ట్ర సరాసరి దిగుబడి ఎకరాకు 11.74 క్వింటాళ్ల వరకు ఉందని కొనుగోలు పరిమితిని 7 క్వింటాళ్ల నుండి 12 క్వింటాళ్లకు పెంచే విధంగా ఆదేశాలివ్వాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర రైతులు తుఫాన్, అకాల వర్షాలు లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఇప్పటికే బాగా నష్టపోయారని, ఇప్పుడు కేంద్రం కూడా నిబంధనల పేరుతో జిన్నింగ్ మిల్లర్లను, రైతులను ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదని అన్నారు. మానవథ థృక్పతంతో ఆలోచించి కొనుగోలు నిబంధనలను ఎత్తివేసి, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించే దిశగా సీసీఐ అధికారులను ఆదేశించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అధికార బృందం వెంటనే సీసీఐ అధికారులను తప్పనిసరి చర్యలు తీసుకునేవిధంగా వారిని ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.

అదే విధంగా ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ కేంద్ర మంత్రి అధికారులతో సమన్వయం చేసుకుంటూ మిల్లర్లు సమ్మే విరమించేలా చూడాలని సూచించారు. కేంద్రం విధించిన అనాలోచిత నిబంధనలతో ఇప్పటి వరకు కేవలం 67 వేల మంది రైతుల నుండి 1.18 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే సేకరించడం జరిగిందని, కొనుగోళ్లు ఊపందుకునే సమయంలో మిల్లర్లు ఇలా సమ్మెలు చేస్తామనడం, కొనుగోళ్లు నిలిపివేస్తామని ప్రకటించడం రైతులకు మంచిది కాదన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమ్మె ఆలోచనలు విరమించాలని మిల్లర్లకు సూచించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జిన్నింగ్ మిల్స్ సమస్యలను సీసీఐ, కేంద్రానికి తెలియజేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తున్న సందర్భంలో సమ్మెకు వెళ్తామనడం సరికాదన్నారు. ఇప్పటికే పత్తి రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే వానలు తగ్గి, ఎండలు పెరుగుతున్నాయి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జిన్నింగ్ మిల్లర్ల సమస్యల పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందని, వారికి తమ ప్రభుత్వం తరపున అన్ని సహాయ, సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.

Next Story