- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు
రాష్ట్రంలో ఈనెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు జరిపేందుకు సీసీఐ అంగీకరించినట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి పత్తి రైతు తన పంటను పూర్తిగా విక్రయించే వరకు కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంచాలని కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈనెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు జరిపేందుకు సీసీఐ అంగీకరించినట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి పత్తి రైతు తన పంటను పూర్తిగా విక్రయించే వరకు కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంచాలని కోరారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ నాణ్యమైన పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందనే భయం రైతుల్లో ఉండటంతో 30 రోజులు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని సీసీఐను ప్రత్యేకంగా కోరినట్లు చెప్పారు. పంట పూర్తిగా మార్కెట్‌కు రాకముందే సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తారనే సమాచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రైతుల ప్రయోజనాలను ప్రాధాన్యంగా తీసుకొని కొనుగోళ్ల గడువును పొడిగించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు సీసీఐ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సంవత్సరం 45.32 లక్షల ఎకరాలలో పత్తిని సాగు చేయగా, 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఇప్పటివరకు 8,80,053 మంది రైతుల నుంచి రూ.12,823 కోట్ల విలువైన 16.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. అదేవిధంగా ఇప్పటివరకు మార్కెట్ ద్వారా 2.24 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యత ప్రమాణాలు లేని పత్తిని కోనుగోలు చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఇంకా 9.99 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి రైతుల వద్ద ఉందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేయడం జరిగిందన్నారు.
పారదర్శకంగా కొనుగోళ్లు..
కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ పై మొదట రైతులు, జిన్నింగ్మిల్లులు నుండి వ్యతిరేకత వచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోయింది. ఈ యాప్ ద్వారా రైతులు క్యూలలో నిలబడకుండా, సమయ ఆదా జరిగిందని, దగ్గరలోని పత్తి కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకునే అవకాశం కలగడంతో పాటు, పత్తి కొనుగోళ్లను రెగ్యులేట్ చేస్తూ, పారదర్శకంగా కొనుగోళ్లను చేపట్టే వెసులుబాటు కలిగిందన్నారు. రాష్ట్రంలో రైతులకు సమయానికి ఎరువుల పంపిణీకి తమ సర్కారు మొబైల్ యూరియా బుకింగ్ యాప్ ని తీసుకొచ్చిందన్నారు. తద్వారా యూరియా బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడంతో పాటు అధిక నిల్వలను నియంత్రిస్తూ పారదర్శక పంపిణీ వ్యవస్థ అమల్లోకి వచ్చిందన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్ల గడువు పొడిగించడంతో రైతులకు ఉపశమనం లభించిందని తెలిపారు. పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకొని రైతులు సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని కోరారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.






