CBI: నాడు కేసీఆర్ నో.. నేడు రేవంత్ యస్.. మళ్లీ తెలంగాణకు సీబీఐ రాకతో రాజకీయ సునామీ?

by Prasad Jukanti |

కాళేశ్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

CBI: నాడు కేసీఆర్ నో.. నేడు రేవంత్ యస్.. మళ్లీ తెలంగాణకు సీబీఐ రాకతో రాజకీయ సునామీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు (Kaleshwaram barrage corruption), వైఫల్యాలపై మరింత లోతైన దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకపై నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈ కేసు విచారణను సీబీఐకి (CBI) అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. తెలంగాణ గడ్డపై సీబీఐని అడుగుపెట్టనివ్వకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Revanth Reddy) అడ్డుకట్ట వేస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సీబీఐకి ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది. సీబీఐ, ఈడీ బీజేపీ జేబు సంస్థలు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధే కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతున్నదో అనేది ఉత్కంఠ రేపుతోంది.

ఫామ్ హౌస్ కేసు ఎఫెక్ట్ తో అనుమతి నిరాకరణ:

బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు స్టేట్ పాలిటిక్స్ ను ఓ కుదుపు కుదిపేశాయి. ఈ కేసులో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగలబోతున్నదని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అంతలో సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ మీడియాకు సమర్పించిన ఆధారాలు అడ్డం తిరాగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీ ఇవ్వబోతున్నదనే టాక్ వినిపించింది. అప్పటికే సీబీఐ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఇక తెలంగాణలోనూ సీబీఐ విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న సమయంలో నాటి కేసీఆర్ (KCR) సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుకు అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు నాడు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో 51 జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఏ కేసులోనైనా దర్యాప్తు కోసం సీబీఐ తెలంగాణలోకి ప్రవేశించానికి వీలు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఏ కేసునైనా విచారణ జరపాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సీబీఐని అనుమతించకుండా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. అయితే ఏదైనా కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశిస్తే రాష్ట్రాలు అనుమతి ఇవ్వకపోయినా సీబీఐకి విచారణ జరిపే అధికారం ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరో కేసు వామనరావు దంపతుల కేసును గత నెలలో సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించింది.

స్టేట్, సెంట్రల్ మధ్యలో బీఆర్ఎస్:

రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మరింత రంజుగా మారాయి. కాళేశ్వరం కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు ఒక ఎత్తైతే ఇకపై మరో ఎత్తు అనేలా రాజకీయం సాగబోతున్నది. కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ విషయంలో బీజేపీ రాజకీయంగా ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకురాబోతున్నది అనేది ఉత్కంఠగా మారుతోంది. కాళేశ్వరం వైఫల్యానికి కారణం కేసీఆరేనని బ్యారేజీల ప్రతి అంశంలోనూ ఆయన జోక్యం చేసుకున్నరని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. చట్ట ప్రకారం ఆయనపై చర్య తీసుకునే స్వేచ్ఛ కూడా ప్రభుత్వానికి ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కీలక దశలో ఉన్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ధీమా తో ఉండగా మళ్లీ తమకు ప్రజలు పట్టం కడతారని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఈసారి తమకు అవకాశం ఇస్తారనే నమ్మకంతో బీజేపీ ఉంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కు గడ్డుకాలం నడుస్తోంది. ప్రత్యర్థుల నుంచి ఎదురుదాడులు, సొంత పార్టీలో కుంపట్లు, మరో వైపు పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో సీబీఐ ఎంట్రీతో బీఆర్ఎస్ పరిస్థితి ఏం కాబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. ఈ కేసు ఎఫెక్టుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది కాలమే సమధానం చెప్పనుంది.

Next Story