కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు.. ఎమ్మెల్సీ కవిత బిజినెస్ లింకులపై ఫోకస్

by Disha Web Desk 4 |
కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు.. ఎమ్మెల్సీ కవిత బిజినెస్ లింకులపై ఫోకస్
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడుగానే వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని విచారించిన ఈడీ పలువురి స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సైతం సీబీఐ, ఈడీ విచారించి అరెస్టు చేశాయి. సౌత్ గ్రూపులో కీలకంగా వ్యవహరించిన కల్వకుంట్ల కవిత సైతం పలుమార్లు ఈడీ ఎదుటకు హాజరయ్యారు. తాజాగా విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. మరో వైపు మనీలాండరింగ్ కేసులో అరెస్టయి మాండొలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలు సంచలనంగా మారాయి.

తాజాగా ఆయన కవితతో సహా పలువురికి సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్‌ను రిలీజ్ చేశారు. కవితకు, కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా ముందు నుంచే ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరిపించాలని నేరుగా సీబీఐ, ఈడీ డైరెక్టర్లతో పాటు హోం మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇది జరిగిన రెండు రోజులకే కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. దీంతో ఆప్, బీఆర్ఎస్ నేతల్లో గుబులు పెరిగింది. తర్వాత ఏం జరగనుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ శుక్రవారం నోటీసులు జారీచేసింది. సీబీఐ హెడ్ క్వార్టర్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా స్పష్టం చేసింది. ఆయనకు నోటీసులు జారీ కావడం ఇదే ఫస్ట్ టైమ్. ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు లేకపోయినప్పటికీ ఇప్పటివరకు నిందితులు, అనుమానితులు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఆయనను ఒక సాక్షిగా సీబీఐ ప్రశ్నించాలనుకుంటున్నది. ఢిల్లీ ఎక్సయిజ్ సెక్రటరీగా పనిచేసిన ‘డేనిక్స్’ ఆఫీసర్ సీ అరవింద్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పాటు అప్పటి ఆ శాఖ కమిషనర్ అరవ గోపీకృష్ణ (ఐఏఎస్) వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను విచారించనున్నది.

ఇప్పటికే ఈడీ తన చార్జిషీట్‌లో ‘కేజ్రీవాల్ బ్రెయిన్ చైల్డ్ ఈ ఎక్సయిజ్ పాలసీ’ అని కామెంట్ చేసింది. ఆదివారం ఆయన ఎంక్వయిరీకి హజరవుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఈ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు వేలాది మంది కార్యకర్తలతో ఊరేగింపుగా మనీశ్ సిసోడియా వెళ్లారు. అదే రోజు రాత్రి అరెస్టయ్యారు. ఇప్పుడు కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరయ్యేటప్పుడు కార్యకర్తల హడావుడి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.

ఐఏఎస్ అధికారుల స్టేట్‌మెంట్స్ కీలకం!

గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశాలతో సంబంధం లేకుండా, ఎలాంటి చర్చలు జరగకుండానే పాలసీపై నిర్ణయాలు జరిగాయని, టాక్స్ స్ట్రక్చర్ ఫైనల్ అయిందని సీ అరవింద్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ స్టేట్‌మెంట్‌తో పాటు అప్పటి ఎక్సయిజ్ కమిషనర్‌గా ఉన్న అరవ గోపీకృష్ణ (ఐఏఎస్) స్టేట్‌మెంట్‌నూ పరిగణనలోకి తీసుకుని కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నది. సిసోడియా ఆదేశాల మేరకే తాను కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ముసాయిదా పాలసీని ఇచ్చానని, అప్పుడు అక్కడ మంత్రి సత్యేంద్రజైన్ కూడా ఉన్నారని, ఆ తర్వాతనే పాలసీలో ఫైనల్ నిర్ణయాలు జరిగాయని సీ అరవింద్ పేర్కొన్నారు.

హోల్‌సేల్ లైసెన్సులు ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ దానిపైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగులో ఎలాంటి చర్చా జరగలేదని, చివరకు మార్చి మధ్యభాగంలో అదే అంశం ముసాయిదా పాలసీలో కనిపించిందని అరవింద్ 2022 డిసెంబరు 7న ఇచ్చిన తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నట్టు ఈడీ ఉదహరించింది. ఇప్పుడు ఈ అంశంపైనే సీబీఐ ఫోకస్ పెట్టి కేజ్రీవాల్ నుంచి వివరణ కోరే చాన్స్ ఉన్నది.

దీనికి తోడు నాన్ కన్‌ఫర్మింగ్ వార్డుల్లో మద్యం దుకాణాలను ఓపెన్ చేయడం ఢిల్లీ మాస్టర్ ప్లాన్ నిబంధనల మేరకు సాధ్యం కాదని తనతో పాటు ఎక్సయిజ్ శాఖ అధికారులు పలు సమావేశాల్లో వివరించామని, సుమారు 200 దుకాణాలను ఓపెన్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీ ద్వారా ఆలోచిస్తున్నదని కూడా అరవింద్ ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. చివరకు తమ మాటలను లెక్కచేయకుండా పాలసీ ఫైనల్ అయిందని, ఆ వార్డుల్లో షాపుల ఓపెనింగ్‌ నిర్ణయం జరిగిపోయినట్టు తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ విభాగం ఇన్‌చార్జిగా ఉన్న విజయ్ నాయర్ దీర్ఘకాలం పాటు కేజ్రీవాల్ క్యాంపు ఆఫీసు నుంచే ఎక్సయిజ్ పాలసీ వ్యవహారాల్లో చొరవ తీసుకుని పనిచేశారని అరవింద్ పేర్కొన్నారు. సెక్రటేరియట్‌లో రెండో నంబర్ కాన్ఫరెన్సు రూమ్‌‌లో లిక్కర్ వ్యాపారులతో 2021 నవంబరులో సిసోడియా మీటింగ్ పెట్టారని, ఆ సమావేశంలో తాను కూడా ఉన్నట్టు అరవింద్ వివరించారు. విజయ్ నాయర్, దినేశ్ అరోరా (ఇతను కూడా ఆప్ పెద్దలకు సన్నిహితుడు) కూడా ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో యాక్టివ్‌గా ఉన్నారని, లిక్కర్ వ్యాపారుల నుంచి పార్టీ పెద్దల పేరు చెప్పి డబ్బు వసూళ్లలో పాల్గొన్నారని వివరించారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అల్కా దివాన్, ఆమె భర్త దివాన్ కలిపి నడిపిస్తున్న దివాన్ స్పిరిట్స్ అనే కంపెనీ నుంచి దినేశ్ అరోరా ముడుపులు తీసుకున్నారని, చివరకు 50% వాటా ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్టు ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసిన విషయాన్నీ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రమేయం, భరోసా లేకుండా దినేశ్ అంత ఒత్తిడిని తమపై తెస్తారా? అనే సందేహాన్ని అల్కా దివాన్ వ్యక్తం చేసినట్టు ఉదహరించారు. ప్రస్తుతం ఇందులోని కొన్ని అంశాలను కేజ్రీవాల్‌ వద్ద సీబీఐ ప్రస్తావించే చాన్స్ ఉన్నది.

ఈడీ చార్జిషీట్‌లో..

విజయ నాయర్‌ చొరవ తీసుకుని ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రు, కేజ్రీవాల్ మధ్య ఒక మీటింగ్‌కు ఏర్పాటు చేశారని, అది జరగకపోవడంతో ఫేస్ టైమ్‌లో వీరిద్దరినీ కాన్ఫరెన్సులోకి తీసుకున్నారని, ఆ సమయంలో సమీర్ మహేంద్రుతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. విజయ్ నాయర్ ‘మై బాయ్’ అని సంబోధించి, అతనిని తన ప్రతినిధిగా విశ్వాసంలోకి తీసుకోవచ్చంటూ హామీ ఇచ్చారని ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొన్నది. చివరకు సమీర్ మహేంద్రు కంపెనీ ఎల్-1గా లైసెన్సు దక్కించుకున్నది. దానికి ప్రతిఫలంగా కిక్ బ్యాక్ రూపంలో 12% పన్నులో సగం తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలకు కమిషన్ రూపంలో ముట్టినట్టు ఈడీ వివరించింది. ఈ వివరాలన్నీ స్పెషల్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఈడీ స్పష్టం చేసింది.

సౌత్ గ్రూపుతో ఉన్న లింకులపైనా ఆరా?

ఈ కేసులో దర్యాప్తు సంస్థలు ప్రధానంగా సౌత్ గ్రూపు ప్రమేయంపైనే ఫోకస్ పెట్టాయి. ఈ గ్రూపులో కల్వకుంట్ల కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రా‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు సీబీఐ, ఈడీ ఇప్పటికే ఆరోపించాయి. కవిత తరపున ప్రతినిధిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్‌కు సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో 32.5% వాటా లభించినట్టు పేర్కొన్నాయి. పాలసీ అమల్లోకి రాకముందే అడ్వాన్స్ కిక్‌బ్యాక్ రూపంలో సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలకు ముట్టినట్టు దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. సౌత్ గ్రూపు ఒత్తిడి మేరకు ఎక్సయిజ్ పాలసీలో లిక్కర్ వ్యాపారులకు అనుకూలమైన నిబంధనలు పెట్టి ప్రతిఫలంగా కమిషన్లు అందుకున్నట్టు ఈడీ ఆరోపిస్తున్నది.

సుఖేశ్ లేఖ రాసిన రెండు రోజులకే

తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దీర్ఘకాలంగా వ్యాపార, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాకముందే వీరిద్దరి మధ్య డబ్బులు చేతులు మారాయని మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యి మండోలి జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఇటీవల ఆరోపించారు. నేరుగా సీబీఐ, ఈడీ డైరెక్టర్లతో పాటు హోం మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. ఇది జరిగిన రెండు రోజులకే కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

లిక్కర్ పాలసీలో 12 శాతానికి టాక్స్ పెంచడం, హోల్‌సేల్ కంపెనీలకు రిటైల్ లైసెన్సులు ఇవ్వడం, ఆప్ పెద్దలకు, సౌత్ గ్రూపునకు మధ్య జరిగిన సమావేశాలు, పాలసీ ఫైనల్ కాకముందే అది లీక్ కావడం.. వీటన్నింటిపై కేజ్రీవాల్ నుంచి సీబీఐ వివరాలను రాబట్టే చాన్స్ ఉన్నది. హైదరాబాద్‌లోని కోహినూర్ హోటల్ మొదలు ఢిల్లీలోని గౌరీ అపార్టుమెంటు, ఒబెరాయి మెయిడెన్ హోటల్‌, తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన మీటింగుల వరకూ పలు అంశాలను సీబీఐ ప్రస్తావించనున్నది. ఎక్సయిజ్ పాలసీలో కుట్ర (నేరం) జరిగిందనే ఆరోపణలపై కేజ్రీవాల్‌ను ప్రశ్నించి, ఆయన నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నది. ఆయన వెల్లడించే వివరాల ఆధారంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై సీబీఐ ఒక స్పష్టతకు రానున్నది.

ఆప్, బీఆర్ఎస్ లింకులపై ఆసక్తి

ఆప్, బీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, వాటి వెనక ఉన్న ప్రయోజనాలపై కేజ్రీవాల్ విచారణ తర్వాత ఏ మేరకు బహిర్గతం అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారాయని సుఖేశ్ చంద్రశేఖర్ తాజాగా ఆరోపణలు చేశారు. వాటిని ధ్రువీకరించే తీరులో వాట్సాప్ ద్వారా జరిగిన సంభాషణల స్క్రీన్ షాట్‌లను విడుదల చేశారు. ఇవన్నీ లిక్కర్ స్కామ్‌కంటే ముందు జరిగినవని సుఖేశ్ ఆరోపణ.

కానీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా ప్రమేయంతో సౌత్ గ్రూపులోని కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, అరబిందో శరత్‌చంద్రారెడ్డి మధ్య సంభాషణలు జరిగాయని, కిక్‌బ్యాక్ రూపంలో ముడుపులు చేతులు మారాయన్నది సీబీఐ, ఈడీ సంస్థలు ప్రాథమికంగా తేల్చాయి. కేజ్రీవాల్ విచారణ తర్వాత ఆప్, బీఆర్ఎస్ మధ్య సంబంధాలపై దర్యాప్తు సంస్థలకు మరికొంత అదనపు సమాచారం లభించే అవకాశమున్నది. కేజ్రీవాల్‌ను ఎంక్వయిరీకి రావాలని నోటీసులు జారీచేయడంతోనే అటు ఆప్ ‌నేతల్లో, ఇటు బీఆర్ఎస్ అగ్రనేతల్లో సరికొత్త గుబులు మొదలైంది. ఈ ఎంక్వయిరీ తర్వాత ఎలాంటి వివరాలు బహిర్గతమవుతాయో అనేదే ప్రధానమైన ఆందోళన.


ఇవి కూడా చదవండి:

కేంద్రంలో మన ప్రభుత్వమే.. 25 లక్షల మందికి ఆ స్కీం : KCR

Next Story

Most Viewed