- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివేకా హత్య కేసు : నాంపల్లి కోర్టులో సునీతకు నిరాశ
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివేకా హత్య కేసులో మరింత లోతుగా, సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
వివేకా హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను తేల్చేందుకు మరింత లోతైన దర్యాప్తు అవసరమని సునీత తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు దర్యాప్తును సమగ్రంగా నిర్వహించలేదని, ఈ కేసులో ఇంకా పలువురు కీలక అనుమానితులను ప్రశ్నించాల్సి ఉందంటూ ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి కేసులో తదుపరి విచారణ కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు తమ వాదనలను వినిపించారు. వివేకా హత్య కేసులో అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు పూర్తి చేసి ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు. అయితే.. న్యాయస్థానం ఆదేశిస్తే మరింత దర్యాప్తు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు.. ఇప్పటికే కేసులో దర్యాప్తు పూర్తయి ఛార్జ్‌షీట్ దాఖలైనందున, సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.






