- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాచ్ ది రెయిన్ వాటర్
దేశవ్యాప్తంగా నీటి భద్రతను పెంపొందించడం, భూగర్భ జలాల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకొని ‘క్యాచ్ ది రెయిన్-2026’ జాతీయ ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోవడంతో బోరుబావులు ఎండిపోతున్నాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటి సౌకర్యాలు కూడా అందని ద్రాక్షలా మారే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నీటి భద్రతను పెంపొందించడం, భూగర్భ జలాల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకొని ‘క్యాచ్ ది రెయిన్-2026’ జాతీయ ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు జలశక్తి మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇటీవల జరిగిన 135వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వర్షపు నీటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి చుక్క వర్షపు నీటిని పొదుపు చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని భారీ ప్రజా ఉద్యమంగా (జన్ భాగీదారీ) తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ) ఈ ప్రచారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, కింది కీలక చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను అమలు చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. భూగర్భ జలాలను పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించింది.
యూఎల్బీల్లో..
రాష్ట్రంలో ప్రస్తుతం 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలోని అన్ని ప్రభుత్వ భవనాలపై రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రీఛార్జ్ పిట్లు, రీఛార్జ్ బావులు, రీఛార్జ్ షాఫ్టులు, ఇంజెక్షన్ బావులు నిర్మించాల్సి ఉంది. వినియోగంలో లేని బోర్‌బావులను పునరుద్ధరించాల్సి ఉంది. స్థానిక చెరువులు, సరస్సులు, సంప్రదాయ నీటి వనరులను పునరుజ్జీవింపజేయడంతో పాటు వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వర్షపు నీరు సాఫీగా ప్రవహించి భూమిలోకి ఇంకేలా పట్టణ కాలువలు, జలాశయాల్లో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు. దీంతో పట్టణాల్లో వరదల నివారణకు కూడా తోడ్పడుతుందని అధికారులు చెబుతున్నారు. పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో వరదనీటిని గ్రహించేలా ‘స్పాంజ్ పార్కులు’ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే రీఛార్జ్ జోన్లు, క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
ప్రజా భాగస్వామ్యం - ప్రచారం
భూగర్భ జలాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ‘జల సంవాదం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక భాషల్లో హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో #CatchTheRain హ్యాష్‌ట్యాగ్‌తో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ, వారి చేత మొక్కలు నాటించే కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రతి మున్సిపాలిటీకి నోడల్ ఆఫీసర్
ఈ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి మున్సిపాలిటీకి ఒక నోడల్ అధికారిని నియమించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. చేపట్టిన పనుల వివరాలు, జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను ప్రతిరోజూ ‘అమృత్ యూనివర్స్ ప్లాట్‌ఫామ్’, ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’ (జేఎస్జేబీ) పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాల అమలును పర్యవేక్షించి, అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భవిష్యత్ తరాల నీటి అవసరాలను తీర్చేందుకు, వాతావరణ మార్పులను తట్టుకునేలా నగరాలను సిద్ధం చేయడానికి ప్రతి ఒక్కరూ ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని మున్సిపల్ శాఖ కోరుతోంది.






