రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాలు

by velandi.Saikiran |   (  Updated:2026-07-16 00:00:19  IST  )

వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు.

రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. రాబోయే రెండేళ్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై రాష్ట్రంలో దాదాపుగా రూ.1.50 లక్షల కోట్లకు పైగా పనులు జరిగే విధంగా ప్రభుత్వం వ్యూహాన్ని రచించింది. ఎన్నికలకు మరో రెండున్నరేండ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఒక్కటే అధికారంలోకి తీసుకురావనే విషయాన్ని అనేక ప్రభుత్వాల విషయంలో స్పష్టమైంది. అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలన(గవర్నెన్స్​) ద్వారా గెలిచినట్లుగా రాజకీయ విశ్లేషకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ సైతం రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి సంక్షేమ పథకాలు ఒక్కటే సరిపోవని, అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు అందితేనే సంతృప్తితో ఓటు వేస్తారని స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల కంటికి కనిపించే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఎన్నికల్లో వాటిని చూపించడం, సంక్షేమ పథకాలను వివరించడం ద్వారా ఓటు అడగొచ్చనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో సీఎం రేవంత్ తన లక్ష్యానికి అనుగుణంగా పంథాను ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రచిస్తున్నారు. వ్యూహాలను అమలు చేస్తున్నారు. వచ్చే రెండున్నరేండ్లలో దాదాపు రూ.లక్షన్నర కోట్ల అభివృద్ధి పనులు జరగాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసి వరుసగా సమీక్ష సమావేశాలు, ప్రణాళికలు అమలు చేసే పనిలో ఉన్నారు.

చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఇవే..

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ప్రధానంగా నగరంలో మెట్రో రెండో దశ పనులు, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ద్వారా చేపడుతున్న హ్యామ్ రోడ్లు, ట్రిపుల్ ఆర్, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, గచ్చిబౌలి స్టేడియం, విమానాశ్రయాలు, తదితర పనులు ఉన్నాయి. వీటితో పాటుగా ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమైన టిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని కూడా 2028 ఆగస్టులోగానే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రధాన అడ్డంకులైన నిధుల సమీకరణ, భూ సేకరణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. మెట్రోకు కేంద్రం కూడా భాగస్వామిగా ఉండి నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దీనిని స్పీడప్ చేయడానికి సీఎం పదే పదే కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. నిధుల సమస్యకు పరిష్కారం త్వరలోనే దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండో దశకు అనుమతి వస్తే దాదాపుగా రూ.40వేల కోట్ల పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు ప్రారంభమైతే నగరంలోని భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. మూసీకి ఏడీబీ బ్యాంకు రూ.7వేల కోట్ల నిధులను మంజూరు చేసింది. రక్షణశాఖ కూడా భూములను బదలాయించింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో ఉత్తర భాగానికి రాష్ట్రం వాటా ఇప్పటికే చెల్లించింది. కేంద్రం టెండర్లు కూడా పిలిచింది. కేబినెట్ ఆమోదం కోసం కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇకపై ప్రతివారం సమీక్ష!

ట్రిపుల్ ఆర్‌లో దాదాపుగా రూ.23వేల కోట్ల పనులు చేపడుతున్నారు. దక్షిణ భాగం భూ సేకరణ చేయనున్నారు. వీటితో పాటుగా వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులను కేంద్రం చేపట్టనుంది. అంతేకాకుండా నీటిపారుదల ప్రాజెక్టులకు సైతం అదనంగా మరో రూ.40వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. వీటితో పాటుగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్​స్కూల్స్‌కు భారీ మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నారు. వీటన్నింటిలో అత్యధికం పూర్తి చేస్తే వాటిని ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని, ఒక వేళ ఏమైనా ఇంకా కొంత భాగం పూర్తి చేయాల్సి ఉంటే రెండోసారి అధికారంలోకి వస్తే వాటిన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. మధ్య తరతగతి, ఉన్నత వర్గాలు, విద్యావంతులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఓటు వేయాలంటే సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా అభివృద్ధి, విద్య, వైద్య కార్యక్రమాలను చూస్తారు. ఈ నేపథ్యంలో వీటిని పూర్తి చేయడానికి ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇకపై ప్రతివారం వీటిపై సమీక్షించనున్నట్లుగా సమాచారం. ఇంజినీరింగ్ అధికారులతో ఉన్నతాధికారులు ఇంటర్నల్‌గా ప్రతి రోజు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టులు అంచనా వ్యయం(రూ.వేల కోట్లు)

మెట్రో రెండో దశ 40

హ్యామ్​ రోడ్లు 20

ట్రిపుల్ ఆర్ 23

మూసీ 07

నీటిపారుదల 40

ఇతర వాటికి 20


Next Story