BJP MP K. Laxman : కులగణన ఓ భారీ కుట్ర : బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-05 12:37:07  IST  )

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కులగణన(Caste Census)పై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ఓ భారీ కుట్రపూరితమైందని..తప్పుల తడక అని బీజేపీ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్(BJP MP Laxman) విమర్శించారు.

BJP MP K. Laxman : కులగణన ఓ భారీ కుట్ర : బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కులగణన(Caste Census)పై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ఓ భారీ కుట్రపూరితమైందని..తప్పుల తడక అని బీజేపీ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్(BJP MP Laxman) విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలను రాజకీయంగా అణిచివేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. బీసీల లెక్కలను తగ్గించి చూపించారని మండిపడ్డారు. సర్వే అశాస్త్రీయంగా, వాస్తవ దూరంగా ఉందని విమర్శించారు. సామాజిక న్యాయం పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండి ఉంటే బిల్లు తీసుకొని వచ్చేవారన్నారు. ఓబీసీలపై వలకబోస్తున్న ప్రేమ బయట పడిందని విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు న్యాయపరమైన అడ్డంకులు తెలియవా అని..ఇప్పుడు 42శాతం పార్టీ టికెట్లు ఇస్తామని మరో నాటకం వేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు వేసే చర్యగానే దీన్ని భావించాలన్నారు. ఇది కాంగ్రెస్ మానసిక ఆలోచనకు అద్దం పడుతోందని మండిపడ్డారు.

మండల్ కమిషన్ లోనూ 51%, బీఆర్ఎస్ సమగ్రకుటుంబ సర్వేలోనూ.. 52% బీసీలున్నారని వెల్లడైందని..మరి ఈ సంఖ్య ఎలా 46%కి వచ్చిందని..4కోట్ల జనాభాలో దాదాపు 6% తగ్గుదల బీసీలకు చేస్తున్న ద్రోహానికి అద్దం పడుతోందని లక్ష్మణ్ ఎత్తిచూపారు. 12% ముస్లింల జనాభాను చూపిస్తూ.. 2% ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలు అని చూపించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మతపరమైన రిజర్వేషన్లు ఉండవనిచెప్పినా.. వీళ్లు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 10 శాతం ముస్లిం బీసీలు, 36 శాతం హిందూ బీసీలు అని కులగణన లెక్కలు పెట్టారని.. ఇది ఒక భారీ కుట్ర అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటే అని.. ముస్లింల మన్నన పొందడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అంటూ రాజ్యాంగ విరుద్ధమైన అంశాన్ని చేర్చారన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం కాదని..చదివితే రాజ్యాంగంలో ఏం ఉందో తెలుస్తుందని వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. కామారెడ్డి సభలో ఇచ్చిన డిక్లరేషన్ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేస్తామంటే బీజేపీ సహించదన్నారు. నీట్‌లో మోడీ 20 శాతం రిజర్వేషన్లు కలిపించారని.. మోడీ బీసీలను ఆదుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ వివరించారు.

కేసీఆర్ ఒక్కరోజుల్లో తడిగుడ్డతో గొంతు కోస్తే.. రేవంత్ 50 రోజుల పాటూ రోజూ పొడిచి పొడిచి చంపారని, బీసీ గణన విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం బీసీల్లో ఉంటుందని.. అందుకే రాష్ట్రాలు సర్వే చేసి కరెక్ట్ వివరాలు సమర్పిస్తే మేం స్వాగతిస్తామని లక్ష్మణ్ చెప్పారు. బిహార్ లో మేం నిష్పక్షపాతంగా చేశామని.. కానీ సిద్దరామయ్య సర్వే చేసి.. ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని. ముస్లింల రిజర్వేషన్లను 12% పెంచుతామని చెప్పి.. బీసీల గొంతు కోసిన మాట నిజం కాదా? అని నిలదీశారు. మధ్యప్రదేశ్ లో శివరాజ్ చౌహాన్.. సర్వే చేసి బీసీలకు న్యాయబద్ధంగా సీట్లు ఇచ్చారని.. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ .. బీసీలకు తగ్గించిన సీట్లపై కోర్టులో పోరాడి దాని ఆధారంగా బీసీలకు సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ పాలసీ విషయంలో బీజేపీ సామాజిక చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

రాహుల్ గాంధీ సమక్షంలో గతేడాది నవంబర్ 6న తెలంగాణలో కులగణన సర్వేను ప్రారంభించారని..ఈ సర్వే దేశానికి ఓ రోల్ మాడల్ అని చెప్పారని..బీసీల ఓట్లను తగ్గించి ముస్లింలకు కట్టబెట్టడమే రోల్ మాడలా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే.. ఇందులో 18 మాత్రమే బీసీలకు ఇచ్చి మిగిలినవి ముస్లింలకు కట్టబెట్టడం అత్యంత దారుణం.32 బీసీ సీట్లలో ముస్లింలుగా గెలిచారన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా 50%లోపే రిజర్వేషన్లు ఉండాలని.. కానీ సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు.. ముస్లింలకు సంబంధించిన 14 కులాలను బీసీలుగా పరిగణిస్తూ.. బీసీలకు దక్కాల్సిన వాటాను ముస్లింలకు కట్టబెట్టారని విమర్శించారు. ఇదేం కొత్తకాదని..సోనియా గాంధీ నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా 27% బీసీ రిజర్వేషన్లలో 4% తొలగించి ముస్లింలకు ఇస్తే.. కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు.

మండల్ కమిషన్ స్పష్టంగా.. 1990లో ముస్లింలలోని రెండు తెగలు (దూదేకుల, మెహతర్)ను బీసీల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని..దీన్ని రాజశేఖర్ రెడ్డి 4%కోసం ప్రయత్నిస్తే.. కేసీఆర్ ఏకంగా 12% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తామని చెప్పారన్నారు. ఇదంతా బీసీల ఓట్లను, బీసీల రిజర్వేషన్లను తగ్గించేందుకు జరిగిన కుట్ర అని లక్ష్మణ్ ఆరోపించారు. దాదాపు 90% ముస్లింలు బీసీలు అని చెప్పడం సిగ్గుచేటని..మండల్ కమిషన్ రెండు తెగలను మాత్రమే బీసీలను అని చెబితే.. మీరు దీన్ని 90%కు పెంచడం దుర్మార్గం. కుట్రపూరితమన్నారు. మీకు బీసీల పట్ల ఏమాత్రం ప్రేమలేదని. నెహ్రూ కుటుంబ ఎజెండాలో రేవంత్ రెడ్డి భాగమయ్యారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే.. మీ ప్రసంగంలో చెప్పినట్లుగా.. తెలంగాణలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు గా ఉన్నప్పుడు.. ఆయా వర్గాలకు మీరు ఎన్ని పదవులు ఇస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ కేబినెట్ లోని మంత్రులు.. నోరు విప్పాలని..బయటకు రావాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు రిజర్వేషన్లలో బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి ఇవాళ తూతూమంత్రంగా నివేదికను సమర్పించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జనాభా పెరగాలని కానీ.. ఇవాళ కోటి 60 లక్షలమందే ఉన్నారని చెప్పడం నమ్మశక్యం కాని విషయమన్నారు. 342‑ఏ చట్టం ప్రకారం .. రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని.. ఆ రాష్ట్రాలు బీసీల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉందని కానీ అలా చేయడం లేదన్నారు. కానీ మోదీ ప్రభుత్వం బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించి బీసీలకు సరైన గౌరవం కల్పించిందన్నారు. జామియా ఇలిమియా వంటి వర్సిటీలకు మైనారిటీ స్టేటస్ ఇచ్చి.. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తేశారన్నారు.


దేశవ్యాప్తంగా 9వేలకు పైగా విద్యాసంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ఎత్తేశారని, రాహుల్ గాంధీ లోక్ సభలో దీని గురించి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. బీసీల ప్రయోజనం కోసం అంబేడ్కర్ కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే.. దాన్ని నెహ్రూ గారు ఎలా తొక్కిపెట్టారో జనాలకు తెలియదా అని ప్రశ్నించారు. చివరకు అంబేడ్కర్ రాజీనామా చేస్తానని చెబితే.. నెహ్రూ వెనక్కు తగ్గారన్నారు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని అంబేడ్కర్ కోరితే.. దాన్ని నెహ్రూ అమలు చేయకుండా ముఖ్యమంత్రులకు లేఖ రాశారన్నారు. మండల్ కమిషన్ నివేదికపైనా.. చర్చ లేకుండా పక్కనపెట్టారని..దీనిపై నాటి ప్రధాని వీపీ సింగ్ చర్చకు పెడితే.. ప్రతిపక్ష నాయకుడిగా రాజీవ్ గాంధీ.. ప్రధాని వీపీ సింగ్ పై తీవ్ర విమర్శలు చేశారన్నారు. మీరు చేస్తున్న కుట్రల్లో బీసీలు భాగం కారని... మీ మాటలు బీసీలు నమ్మరన్నారు. ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని. అలాగే ఇప్పుడు కులగణనతో బీసీలను మోసం చేస్తున్నారన్నారు. ఏడాదికి 20వేల చొప్పున ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పి కులాల పేరుతో ఏర్పడిన కార్పొరేషన్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని ఇవ్వలేదన్నారు.

ప్రధాని మోదీ బీసీల సంక్షేమం కోసం.. బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్ధత ఇచ్చారని, నీట్ పరీక్షల్లో 27% రిజర్వేషన్లు కల్పించారని, ఉన్నత విద్యాసంస్థల్లోనూ ఈ రిజర్వేషన్ల కారణంగా.. గత పదేళ్లుగా బీసీలు నాణ్యమైన ఉన్నతవిద్యకు నోచుకుంటున్నారని తెలిపారు. బీసీల అవకాశాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మూకశ్మీర్లో 75 ఏళ్లపాటు రిజర్వేషన్లు లేవని..మోదీ 370 తొలగించిన తర్వాతే వారందరికీ రిజర్వేషన్లు అందాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు..ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ఇచ్చిందే మోదీ అని...రిజర్వేషన్లు పెంచిందే బీజేపీ అని.. వాటిని తగ్గించే కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

Next Story