నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి.. అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

by Ramesh Naini |

‘భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తే ఊరుకునేది లేదు. పవన్ కల్యాణ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు సరికాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై రాజకీయదాడిని ఆపాలి. ఏపీలో నాగేశ్వర్ పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి’ అని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.

నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి.. అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తే ఊరుకునేది లేదు. పవన్ కల్యాణ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు సరికాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై రాజకీయదాడిని ఆపాలి. ఏపీలో నాగేశ్వర్ పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి’ అని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్చను గౌరవించుకుంటామని జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి సమావేశానికి హజరైన సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ రాజకీయ విశ్లేషణపై ఏపీలో కొన్ని పార్టీలు, వారి సోషల్‌ మీడియా బృందాలు చేస్తున్న కక్షపూరిత దాడి, ట్రోలింగ్‌ ను ఈ అఖిల పక్ష సమావేశం తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేసింది. ఇప్పటికే నాగేశ్వర్‌ తన మాటలను ఉపసంహరించుకున్నా, విద్వేషపూరిత దాడి కొనసాగించడం సరికాదని, జనసేన ఆ అంశానికి ముగింపు పలికినట్లు ప్రకటించినప్పటికీ నాగేశ్వర్‌ పై ఆంధ్రప్రదేశ్‌ లో కేసులను ఎత్తివేయలేదని, తక్షణమే ఈ అంశానికి ముగింపు పలికి, నాగేశ్వర్‌ పై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సభ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రౌండ్‌ టేబుల్‌ సమావేశంఏకగ్రీవంగా ఆమోదించింది. భావ ప్రకటన స్వేచను పరిరక్షించాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్య వాతావరణం పరిఢవిల్లాలని అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది. రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌పై జరుగుతున్న కక్షపూరిత దాడులు, సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌, అక్రమ కేసులను రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ముక్తకంఠంతో ఖండించారు.

భావప్రకటన స్వేచ్చే ప్రజాస్వామ్యానికి పునాది

ఈ సందర్భంగా జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ సత్యాన్వేషణ, భావప్రకటన స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి పునాది అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ అనేది లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడే సాధ్యం కాదన్నారు. ‘ప్రజాస్వామ్యం ఎప్పుడూ భిన్నాభిప్రాయాలను ప్రోత్సహిస్తుంది. ఒకరి విశ్లేషణతో అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ, ఆ అభిప్రాయాన్ని చెప్పే హక్కును కాపాడటం సమాజ బాధ్యత’ అని ఆయన స్పష్టం చేశారు.

నాగేశ్వర్ గొంతును కాపాడుకోవాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నాగేశ్వర్‌ గొంతును కాపాడుకోవాలన్నారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక విజ్ఞాన ఖని లాంటివారని, ప్రజా గొంతుకైన ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒక విశ్లేషణపై వివాదం చెలరేగినప్పుడు నాగేశ్వర్‌ పెద్ద మనసుతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాక కూడా, దాన్ని ఇంకా పెద్ద వివాదంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయ కుట్రలను అర్థం చేసుకోవాలన్నారు. పొరుగు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం, కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ సమాజం అందరినీ ప్రేమిస్తుందని, అయితే ఇక్కడి అస్థిత్వంపై దాడి చేస్తే ఊరుకోదని సాంబశివరావు స్పష్టం చేశారు.

అభిప్రాయాలు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు

ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ.. భావప్రకటన స్వేచ్ఛను గౌరవించడం ప్రజాస్వామ్య సమాజానికి అత్యవసరమని అన్నారు. నాగేశ్వర్‌ వ్యక్తపరిచే అభిప్రాయాలు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదని, విభేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా, ప్రత్యామ్నాయ అభిప్రాయాల ద్వారా వ్యక్తపరచాలని సూచించారు. అభిప్రాయ భేదాల పేరుతో దాడులకు దిగడం అన్యాయమని, అమానుషమని, అనాగరికమని ఆయన విమర్శించారు.

నాగేశ్వర్‌ను అడ్డంపెట్టుకుని విద్వేషాలు

ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ తెలంగాణకు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదని, అయితే తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను గౌరవించడం అవసరమన్నారు. నాగేశ్వర్‌ అంశాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు పెరిగేలా వ్యవహరించడం ఎవరికి మేలు చేయదన్నారు. తెలంగాణ ప్రజలు ప్రేమ, సహనానికి ప్రతీకలని, ద్వేష రాజకీయాలకు తావివ్వకూడదని దయాకర్‌ అన్నారు. జనసేనతో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయాలు చేయాలని, తెలంగాణ అస్తిత్వం, భావోద్వేగాలను గౌరవించాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పరస్పర ఆరోపణలకు ఇక ముగింపు పలికి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు.

భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలి

సీనియర్‌ సంపాదకులు కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రాంతీయవాదాన్ని జాతీయ భద్రతా సమస్యగా లేదా ఉగ్రవాదంతో పోల్చే వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య చర్చలను దెబ్బతీస్తాయని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అనవసర వైరుధ్యాలను సృష్టించే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సహజ మిత్రులని, వారి మధ్య విద్వేష సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఒక రాజకీయ విశ్లేషకుడిగా తన అభిప్రాయాలను వెల్లడించారని, విశ్లేషకులు, జర్నలిస్టులను రాజకీయ ప్రత్యర్థులుగా భావించి లక్ష్యంగా చేసుకోవడం ప్రమాదకర ధోరణి అని విమర్శించారు. అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని చర్చల ద్వారా ఎదుర్కోవాలే తప్ప వ్యక్తిగత దాడులు, ట్రోలింగ్‌లు సమర్థనీయం కాదని పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ వెనుక బీజేపీ ఎజెండా

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య మాట్లాడుతూప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అంశం ఆంధ్రా-తెలంగాణ పంచాయితీ కాదని, అది కేవలం మీడియా స్వేచ్ఛకు సంబంధించిన విషయమన్నారు. అయితే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక్కడికి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పుండు మీద కారం చల్లడమేనన్నారు. ముగిసిపోయిన ప్రాంతీయ విభేదాలను మళ్లీ రగల్చడం ద్వారా ఇక్కడి ఓట్లను చీల్చి రాజకీయ లబ్ధి పొందాలనేది బీజేపీ వ్యూహమని, ఆ ఎత్తుగడలో పవన్‌ కల్యాణ్‌ ఒక పాచికగా మారారని విమర్శించారు.

సిరా ఇంకేవరకు రాస్తూనే ఉంటాను..

ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌ మాట్లాడుతూ గత 15 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రజాసమస్యలను పక్కనపెట్టి తన చుట్టూనే చర్చలు నడపడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, రైల్వే జోన్‌ లాంటి కీలక అంశాలపై చర్చించని మీడియా ఛానళ్ళు, తనపై గంటల తరబడి చర్చలు పెట్టడం వెనుక ఉన్న అధికార వర్గాల విశృంఖలత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘నా మాటల్లో ఎక్కడా కుల ప్రస్తావన గాని, అల్లర్లు రేపే ఉద్దేశం లేదు. అయినా హైకోర్టులు కొట్టేసిన సెక్షన్లను నాపై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నేను భయపడను. పదవుల కోసమో, ప్రలోభాల కోసమో నేను మాట్లాడటం లేదు. ప్రజాపక్షాన నిలబడటమే నా బాధ్యత. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నా పెన్నులో సిరా ఇంకేవరకు నేను రాస్తూనే ఉంటాను. మాట్లాడుతూనే ఉంటాను. తప్పితే ఎలాంటి నిర్బంధాలకూ లొంగే ప్రసక్తే లేదు’ అని నాగేశ్వర్‌ స్పష్టం చేశారు. సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్‌) మాస్‌ లైన్‌ నాయకురాలు రమ మాట్లాడుతూ.. నాగేశ్వర్‌పై పెట్టిన అన్ని అక్రమ కేసులను ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. భిన్నాభిప్రాయాలను గౌరవించే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగ పరిరక్షణకు తెలుగు నేలపై అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని కోరారు.

Next Story