విద్యార్థుల ఆకలి కేకలు వినిపిస్తలేవా.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

by Kema Shiva Kumar |

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 123 మంది విద్యార్థులు మరణించడం, రెండేళ్లుగా విద్యాశాఖ మంత్రి లేకపోవడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆకలి కేకలు వినిపిస్తలేవా.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, చిన్నారులు కనీసం తిండి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సి రావడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. తాజాగా జనగామ జిల్లా గూడూరు గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు నాణ్యమైన భోజనం కోసం రోడ్డుపై బైఠాయించిన ఘటనపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు, ప్లేట్లు పట్టుకుని పాలకుర్తి – స్టేషన్ ఘన్‌పూర్ రోడ్డుపై కూర్చోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. తమ హయాంలో గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిస్తే, నేడు కాంగ్రెస్ పాలనలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో నెలకొన్న దారుణ పరిస్థితులను నెలకొన్నాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏకంగా 112 సార్లు ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ ఫైర్ అయ్యారు. 2,422 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవ్వడం, 123 మంది మరణించడం చూస్తుంటే ప్రభుత్వం నిద్రపోతోందా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రికి కేవలం రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లపై ఉన్న శ్రద్ధ, విద్యాశాఖపై లేదని ఎద్దేవా చేశారు. పార్ట్ టైమ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌కు విద్యార్థుల ప్రాణాల కంటే భూదందాలే ముఖ్యం కావొచ్చని సెటైర్లు వేశారు. కానీ, విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం వల్లే పర్యవేక్షణ కరువైందని, తక్షణమే ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story