- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నామినేషన్ల రిజెక్షన్లపై వివాదం! ఎందుకు తిరస్కరించారో చెప్పడంలేదని బాధితుల ఆరోపణలు
గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజునుంచే అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజునుంచే అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల ప్రకారం ప్రజా సేవ చేయాలనుకున్న అనేకమంది సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఆశలు మొదటి దశలోనే చిగురుటాకులయ్యాయి. అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం, నామినేషన్ క్లస్టర్ల వద్ద హెల్ప్‌డెస్క్‌లు సరిగా పనిచేయకపోవడం వల్ల సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు రిజెక్ట్ కావడం తీవ్ర వివాదానికి దారితీసింది. నామినేషన్ ఫారాల్లో సంతకాలు అసంపూర్ణంగా ఉండటం, కొన్ని వివరాలు తప్పుగా నింపబడటం వంటి కారణాలతో అధికారులు భారీగా రిజెక్షన్లు చేసినట్లు తెలిసింది. అయితే రిజెక్ట్ చేసిన పత్రాల్లో తప్పుల వివరాలు తెలియజేయలేదంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరిశీలన సమయంలో చెక్‌లిస్ట్ ఇవ్వకపోవడంతో తాము ఎక్కడ పొరపాటుచేశామో కూడా తెలియలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా 37 మంది సర్పంచ్ అభ్యర్థులు, 72 మంది వార్డు సభ్యుల నామినేషన్లు రిజెక్ట్ కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉండటంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
హెల్ప్‌డెస్క్‌ల వద్ద అధికారులు లేక అయోమయం..
మండలంలో ఏర్పాటు చేసిన ఐదు నామినేషన్ క్లస్టర్లలో హెల్ప్‌డెస్క్‌లు పనిచేయాల్సి ఉండగా ఏ క్లస్టర్‌లోనూ సంబంధిత అధికారులను కనిపెట్టలేదని అభ్యర్థులు ఆరోపించారు. అవసరమైన సూచనలు లేకపోవడంతో తమంతట తాము నామినేషన్ పత్రాలు నింపి సమర్పించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అభ్యర్థుల నామినేషన్లు అందుకున్న అధికారులు వాటిని తక్షణం పరిశీలించడం, తప్పులు ఉంటే వెంటనే తెలియజేయడం వంటి బాధ్యతలను నిర్వర్తించలేదని బాధితుల ఆరోపణలు చేశారు.
పాతర్ల పహాడ్ క్లస్టర్‌లో అత్యధిక రిజెక్షన్
ఐదు క్లస్టర్లలో పాతర్ల పహాడ్ క్లస్టర్‌లోనే అత్యధికంగా రిజెక్షన్లు నమోదయ్యాయి. 21 మంది సర్పంచ్, 45 మంది వార్డు అభ్యర్థుల నామినేషన్లు రద్దు చేయడం అభ్యర్థుల ఆగ్రహానికి దారితీసింది. సోమవారం క్లస్టర్ కేంద్రం వద్ద బాధితులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. సమాచారం అందుకున్న ఎంసీడీవో, తహసీల్దార్, ఎస్ఐలు అక్కడకు చేరుకుని రిటర్నింగ్ అధికారితో తాత్కాలికంగా తప్పుల జాబితా చదివించి పరిస్థితిని చల్లబరిచారు. అయితే ఆర్డీవో కార్యాలయంలో అప్పీలు చేసినప్పటికీ పరిష్కారం దొరకలేదని అభ్యర్థులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతల ఒత్తిడికి లోనై తిరస్కరణలు చేసారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే రిజెక్ట్ చేశారని ఆరోపిస్తూ, రిటర్నింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్లు మాజీ సర్పంచ్ మడ్డి వెంకన్న తెలిపారు.
మండలంలోని నామినేషన్ గణాంకాలు..
మొత్తం 30 గ్రామ పంచాయతీలకు గాను 30 సర్పంచ్ స్థానాలకు 274 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలో మొత్తం 5 నామినేషన్ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు.
క్లస్టర్ల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా..
పాతర్ల పహాడ్: 76 సర్పంచ్, 159 వార్డులు
ఆత్మకూరు: 46 సర్పంచ్, 131 వార్డులు
నెమ్మికల్: 60 సర్పంచ్, 183 వార్డులు
తుమ్మలపెన్‌పహాడ్: 53 సర్పంచ్, 139 వార్డులు
ఏపూర్: 55 సర్పంచ్, 183 వార్డులు






