- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్ పై పోరులో.. క్యాన్సర్ అట్లాస్ శక్తివంతమైన ఆయుధం : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో క్యాన్సర్ రహిత సమాజం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఈ పోరాటంలో 'క్యాన్సర్ అట్లాస్' ఒక శక్తివంతమైన ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో క్యాన్సర్ రహిత సమాజం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఈ పోరాటంలో 'క్యాన్సర్ అట్లాస్' ఒక శక్తివంతమైన ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ ముఖ్యమంత్రిని కలిసి, తెలంగాణలో క్యాన్సర్ వ్యాధి స్థితిగతులపై రూపొందించిన సమగ్ర నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి ఎక్కడెక్కడ కేంద్రీకృతమై ఉందో గుర్తించేందుకు డాక్టర్ నోరి దత్తాత్రేయ రూపొందించిన అట్లాస్ ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం వ్యాధిని గుర్తించడమే కాకుండా, ఆయా ప్రాంతాల్లో క్యాన్సర్ అధికంగా ఉండటానికి గల మూల కారణాలను అన్వేషించేందుకు ఈ నివేదిక దోహదపడుతుంది." అని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్ సెంటర్లు
అట్లాస్‌లో వెల్లడైన గణాంకాల ఆధారంగా, క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్షణమే ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. దీనివల్ల వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాపాయం నుంచి రక్షించే వీలుంటుందన్నారు. "క్యాన్సర్ చికిత్స అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే అనే పరిస్థితి మారాలి. బాధితులు అధికంగా ఉన్న జిల్లాల్లోనే ప్రత్యేక ఆస్పత్రులను నిర్మించి, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేస్తాం. ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సను మరింత మెరుగ్గా, పారదర్శకంగా అందించాలని అధికారులను ఆదేశిస్తున్నాం." అని సీఎం పేర్కొన్నారు. సమగ్ర నివేదికను అందించిన నోరి దత్తాత్రేయుడిని సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చోంగ్థూ పాల్గొన్నారు.






