- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మిడ్ మానేర్’ లీజ్ రద్దు.. పదేళ్లకే పరిమితం చేసే ఛాన్స్!
ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టును 33 ఏండ్ల పాటు ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టినట్టుగానే, మిడ్ మానేరు డ్యామ్‌ను సైతం మరో ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తూ బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాన్ని సీఎం రేవంత్ తాజాగా గుర్తించి ఆ ప్రపోజల్స్‌ను రద్దు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టును 33 ఏండ్ల పాటు ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టినట్టుగానే, మిడ్ మానేరు డ్యామ్‌ను సైతం మరో ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తూ బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాన్ని సీఎం రేవంత్ తాజాగా గుర్తించి ఆ ప్రపోజల్స్‌ను రద్దు చేశారు. దాని స్థానంలో కొత్త నిబంధనలను తయారు చేస్తున్నట్టు తెలిసింది. 33 ఏండ్ల పాటు సదరు ప్రైవేట్ కంపెనీకి మిడ్ మానేడ్ డ్యామ్‌ను లీజుకు ఇవ్వకుండా కేవలం 10 ఏండ్లకే పరిమితం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతి పదేండ్లకు ఓసారి లీజు ధరలను పెంచేలా నిబంధనలు తయారు చేసినట్లు తెలుస్తున్నది.
ఓటమితో బెడిసి కొట్టిన ప్లాన్..
మిడ్ మానేరు డ్యామ్‌లో కేజ్ కల్చర్ (నీళ్లలో బోనులు ఏర్పాటు చేసి అందులో చేపల పెంచడం) పేరుతో ఓ ప్రైవేటు కంపెనీకి మేలు చేసేందుకు నాటి సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ కంపెనీకి మిడ్ మానేరు డ్యామ్ వెనుక భాగాన పెద్ద ఎత్తున భూ కేటాయింపులు చేయడంతో పాటు టీజీఐఐసీ(తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) ద్వారా మౌలిక వసతులను సమకూర్చింది. సదరు కంపెనీకి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినదాని కన్నా ఎక్కువ రాయితీలను ఇచ్చేందుకు ప్రపోజల్ తయారైంది. డ్యామ్‌లో 600 బోనులు ఏర్పాటు చేసి చేపలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అక్కడ పెంచిన చేపలను జాతీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించేందుకు అనుమతులు సైతం ఇచ్చింది. నామమాత్రపు లీజును నిర్ణయించి, 33 ఏండ్ల పాటు డ్యామ్‌లో కేజ్ కల్చర్‌కు ఒప్పందం రెడీ చేసింది. అది అమల్లోకి రాకముందే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కథ మొదటికొచ్చింది.
బీఆర్ఎస్ నేతల కంపెనీ?
కేజ్ కల్చర్ ఇండస్ర్టీలో ఓ ప్రైవేటు కంపెనీతో పాటు బీఆర్ఎస్‌లోని కీలక నేతల భాగస్వామ్యం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే మిడ్ మానేరు డ్యామ్‌లో ఏర్పాటు చేసే కేజ్ కల్చర్ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం ఉత్సాహం చూపిందనే ఆరోపణలున్నాయి. అందుకే అక్కడ ఎలాంటి టెండర్లు పిలవకుండా తమకు నచ్చిన, తాము చెప్పినట్లుగా నడుచుకునే ఓ ప్రైవేటు కంపెనీ తెరముందుకు తెచ్చారని చర్చ ఉంది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సదరు ప్రవేటు కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. నాటి పాలకులు ఏ విధంగా తమపై ఒత్తిడి తెచ్చి తమ వ్యాపారంలో వాటాలు అడిగారో వివరించి ఆవేదన చెందినట్లు తెలిసింది.
కొత్త రూల్స్‌కు సీఎస్ ఆమోదం
ఇష్టానుసారంగా లీజులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. కేజ్ కల్చర్ నిర్వహించేందుకు డ్యామ్‌ను 10 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు పరిమితం చేసినట్టు తెలిసింది. లీజు ధరలను ప్రతి పదేళ్లకు ఓసారి పెంచే విధంగా రూల్స్ తయారు చేసినట్లు టాక్. అలాగే ఇరిగేషన్, ఫిషరీస్ శాఖల మానటరింగ్ ఉండేలా వెసులు బాటు కల్పించినట్లు సమాచారం. ఈ కొత్త రూల్స్‌కు సీఎస్ శాంతికుమారి ఈ మధ్యే ఆమోదం లభించినట్లు తెలిసింది. దీనితో సదరు కంపెనీ త్వరలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.






