KCR : కేసీఆర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయండి : హైకోర్టులో పిల్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-21 07:33:06  IST  )

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని సవాల్ చేస్తూ..ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు(Cancel legislative membership)చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ (PIL in High Court) దాఖలైంది.

KCR : కేసీఆర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయండి : హైకోర్టులో పిల్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని సవాల్ చేస్తూ..ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు(Cancel legislative membership)చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ (PIL in High Court) దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి(Vijay Pal Reddy) కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. అసెంబ్లీకి రానప్పుడు శాసన సభ్యుడిగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోర్టును కోరారు. 2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని, ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచారని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోర్టును కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని కూడా విజయ్ పాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని పిటిషనర్ చెప్పారు. ప్రతివాదులుగా కేసీఆర్, కేటీఆర్ లతో పాటు స్పీకర్, స్పీకర్ కార్యాలయాన్ని చేర్చారు. కేసీఆర్ శాసన సభ్యత్వ రద్ధు పిటిషన్ కు విచారణార్హత ఉందో లేదో తేల్చేందుకు ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన పక్షంలో ఇదే తరహాలో ఏపీలో శాసన సభకు దూరంగా ఉంటున్న వైసీసీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ పై కూడా పిటిషన్లు దాఖలు చేసే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేతగా, తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటికి ఆయన గజ్వేల్ నుంచి శాసన సభ్యుడిగా వరుసగా మూడోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ శాసన సభ పక్ష నేతగా పతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ఎన్నికైన నాటి నుంచి కేవలం రెండు పర్యాయాలు మాత్రమే కేసీఆర్ సభకు వచ్చారని..ఫామ్ హౌజ్ కు పరమితమవుతూ శాసన సభ్యుడిగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ తన రాజకీయ జీవితంలో 13 సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. 2004లో 14వ లోక్ సభ ఎన్నికల్లో, 2006లో ఉప ఎన్నికతో కలిపి రెండుసార్లు ఎంపీగా, 2009లో 15వ లోక్ సభలో ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో 16వ లోక్ సభలో ఎంపీగా ఎన్నికైనప్పటికి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2004-06మధ్య ఒక పర్యాయం కేంద్ర కార్మిక, ఉపాధి, రేవులు, నౌకయానం, జలరవాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ తొలి సీఎంగా 2014లోబాధ్యతలు చేపట్టారు. 2018అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంతో రెండోసారి వరుసగా తెలంగాణ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2014 జూన్‌ 2 నుండి 2023 డిసెంబరు 6 వరకు 9 సంవత్సరాల 187 రోజులపాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, స్వాతంత్య్రానికి పూర్వం నుండి 2023 వరకు అత్యధికకాలం వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగు నాయకుడిగా రికార్డు సృష్టించాడు.

Next Story