తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై ‘కాగ్’ బాంబ్: మనుగడ ప్రశ్నార్థకమని హెచ్చరిక

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల తీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) విస్తుపోయే నిజాలను బయటపెట్టింది.

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై ‘కాగ్’ బాంబ్: మనుగడ ప్రశ్నార్థకమని హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల తీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 2023 మార్చి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్.. రాష్ట్రంలోని మెజారిటీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, కనీసం లెక్కలు సమర్పించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, వాటిలో 16 సంస్థలు ఇప్పటికే మూతపడటం లేదా లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నాయి. మిగిలిన 67 సంస్థల్లో ఏకంగా 49 సంస్థలు తమ వార్షిక ఖాతాలను సమర్పించడంలో జాప్యం చేశాయి. కేవలం 18 సంస్థలు మాత్రమే ఆడిటింగ్‌కు సహకరించగా, వాటి పనితీరును విశ్లేషించిన కాగ్ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. విశ్లేషణకు తీసుకున్న 18 సంస్థల్లో కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉండగా, 11 సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. 9 సంస్థల నెట్ వర్త్ (నికర విలువ) నష్టాల కారణంగా పూర్తిగా కరిగిపోయింది. మొత్తం మీద ఈ సంస్థల నెట్ వర్త్ -₹50,930 కోట్లకు పడిపోవడం గమనార్హం.

రూ.25 కోట్ల నష్టం..

ఈ సంస్థల్లో ప్రభుత్వం చేసిన మొత్తం పెట్టుబడులు ₹98,572 కోట్లుగా ఉన్నాయి. సింగరేణి కాలరీస్ (SCCL) పై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించి కీలక అవకతవకలను గుర్తించింది. కొన్ని ఒప్పందాల్లో అవసరానికి మించి డీజిల్ వినియోగించినట్లు గుర్తించారు. కాంట్రాక్టుల్లోని లోపాల వల్ల ₹251 కోట్ల మేర అనవసర ఖర్చు జరిగింది. నిబంధనల అమలులో వైఫల్యం వల్ల ₹74 కోట్ల అదనపు భారం పడగా, బొగ్గు రవాణాలో లోపాల వల్ల ₹25 కోట్ల నష్టం వాటిల్లింది. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల పేరుతో ₹1,078 కోట్ల అదనపు వసూళ్లు జరిగినట్లు కాగ్ ఆక్షేపించింది.

నియమ నిబంధనలు గాలికి..

సంస్థల పాలనలో (Corporate Governance) తీవ్ర లోపాలున్నట్లు నివేదిక వేలెత్తి చూపింది. 15 సంస్థల్లో 9 సంస్థలకు స్వతంత్ర డైరెక్టర్లే లేరని.. ఎక్కడా డైరెక్టర్ల సమావేశాలు నిర్వహించలేదని.. 5 సంస్థల్లో ఆడిట్ కమిటీలు, 9 సంస్థల్లో NRC లేకపోవడం గమనార్హం. పర్యావరణ నిబంధనలను పాటించడంలోనూ సింగరేణి విఫలమైందని, ఎఫ్లువెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని కాగ్ పేర్కొంది.

కాగ్ చేసిన కీలక సూచనలు..

పునఃసమీక్ష: నష్టాల్లో ఉన్న సంస్థల పనితీరుపై ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలి. పెండింగ్‌లో ఉన్న వార్షిక ఖాతాలను వెంటనే పూర్తి చేసి సమర్పించాలి. కాంట్రాక్టుల్లో లొసుగులు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి. పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి.

Next Story