TG Cabinet: రేపే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రేవంత్ టీమ్ లోకి కొత్త మంత్రులు ఎవరు?

by Prasad Jukanti |

తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం కొలిక్కి వచ్చింది. కొత్త మంత్రులు ఎవరు పాత మంత్రుల పరిస్థితి పై జోరుగా చర్చ జరుగుతోంది.

TG Cabinet: రేపే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రేవంత్ టీమ్ లోకి కొత్త మంత్రులు ఎవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : ఏడాదిన్నరకుపైగా ఆశావహులను ఊరిస్తూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు (TG Cabinet Expansion) కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రేపు కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు సీఎం సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం మరో ఆరుగురు మంత్రులకు చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ఈ దఫా ముగ్గురు లేదా నలుగురికి అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గవర్నర్ తన ముందస్తు షెడ్యూల్ ప్రకారం అందుబాటులో లేకపోవడంతో రేపు ఆయన తిరిగి తెలంగాణకు రాగానే మంత్రివర్గ విస్తరణపై రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాదిగ, బీసీ, రెడ్డి/ వెలమలకు చోటు దక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రమోషన్.. డిమోషన్?..

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తుదిదశలో మరోసారి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరెవరికి ఏయే శాఖ కేటాయించాలి? జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణాలపై నేతలతో సీఎం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు సీఎం ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపి తన ఆలోచనలను వివరించారు. ఇటీవలే పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చర్చించారు. ఇదే సమయంలో కొంతమంది మంత్రుల తీరుపై అధిష్టానం సంతృప్తికరంగా లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రమోషన్ ఎవరికి, డిమోషన్ ఎవరికి? అనేది ఆసక్తిగా మారింది.

కొత్త టీమ్‌లో చోటెవరికి?..

సీఎం రేవంత్ టీమ్‌లోకి కొత్తగా ఎవరు రాబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అయితే ఈ దఫాలో ఈ జిల్లాల వారికి తప్పక అవకాశం దక్కబోతుందనే చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ జిల్లాల్లో పెద్దఎత్తున ఆశావహులు ఉండటం, ఆయా సామాజిక వర్గాల నుంచి అధిష్టానంపై ఒత్తిడి పెరగడంతో మంత్రివర్గ అవకాశం దక్కించుకోబోయే ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా తమకు అవకాశం ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుంటే ఇక తమకు చాన్స్ కావాలని సీనియర్ నేత ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్కాన్‌సింగ్ ఠాకూర్, వాకాటి శ్రీహరి, బాలునాయక్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి సైతం తమకు బెర్త్ ఖరారు చేయాలని పార్టీ పెద్దలను కోరుతూ వస్తున్నారు. దీంతో తెలంగాణ కేబినెట్‌లో చోటు దక్కించుకోబోయే ఆ నలుగురు ఎవరనేది ఉత్కంఠగా మారింది.

Next Story