Cabinet Expansion: కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్..! సీఎం రేవంత్‌కు క్లారిటీ ఇచ్చిన హైకమాండ్

by Kema Shiva Kumar |

సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది

Cabinet Expansion: కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్..! సీఎం రేవంత్‌కు క్లారిటీ ఇచ్చిన హైకమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇద్దరు లేదా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుని, మిగతా ఖాళీలను లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత భర్తీ చేయొచ్చని తెలుస్తున్నది. ఈ మేరకు డిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే రేవంత్ జాబితాను ఢిల్లీ పెద్దలకు సమర్పించినట్టు తెలిసింది. ఆయన విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత విస్తరణకు ముహుర్తం ఖరారవుతుందని సమాచారం.

అటు విమర్శలు, ఇటు అలకలకు చెక్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబరు 7, 2024తో ఏడాది పూర్తయింది. కాని ఇంతవరకు ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేయకపోవడంతో విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాగే ఆశావాహులు సైతం కొన్ని సందర్భాల్లో అలక పూనుతున్నారనే టాక్ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీ ఏమైందంటూ ఏఐసీసీ నేతల వద్ద గుర్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీనితో కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు రేవంత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 25న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన కొన్ని జిల్లాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ కార్యక్రమం మధ్యలోనే కేబినెట్ విస్తరించే యోచనలో ఉన్నట్టు ప్రచారం ఉంది. ఒకవేళ ఇప్పుడు విస్తరణ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు పెండింగ్‌లో పడే చాన్స్ ఉందని చర్చ జరుగుతున్నది.

సామాజిక సమీకరణనే సమస్య

ప్రస్తుతం కేబినెట్‌లో సీఎం రేవంత్‌తో కలుపుకుని 12 మంది ఉండగా, మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఎవరెవరిని కేబినెట్‌లోకి తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసినట్టు తెలుస్తున్నది. రెడ్డి సామాజికవర్గం నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి రేసులో ఉన్నారు. ఇందులో ఎవరిని కాదని పక్కనపెట్టినా ఇబ్బందులు వచ్చే చాన్స్ ఉంది. అందుకని ముందుగా ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మైనార్టీ వర్గానికి మంత్రి పదవులు ఇచ్చి, మిగతా వాటిని కొంత కాలం తర్వాత భర్తీ చేయొచ్చని అధిష్టానం సూచించినట్టు తెలుస్తున్నది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్, చీఫ్​ విప్ పదవులు తీసుకునేందుకు రెడ్డి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే, ఒకేసారి 6 మందితో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతున్నది. విస్తరణకు ఇప్పుడు ముహుర్తం కుదరకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయ్యేవరకు నిరీక్షించక తప్పుదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story