- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ నిలిచిపోనున్న క్యాబ్, రైడ్ సేవలు!.. ఆ యాప్‌లను తొలగించాలని ప్రభుత్వం నోటీసులు
మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో యాప్‌లను తొలగించాలని గూగుల్, యాపిల్‌లకు నోటీసులు జారీ అయ్యాయి. బైక్ టాక్సీలపై వివాదం మళ్లీ చర్చనీయాశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత ట్యాక్సీలు వచ్చాక బైక్ ట్యాక్సీల వినియోగం పెరిగిపోయింది. సామాన్యులకు సైతం చేరువైన ఈ బైక్ ట్యాక్సీలపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ఉబెర్, ఓలా, రాపిడో యాప్‌లను తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థకు మహారాష్ట్ర సైబర్ విభాగం నోటీసులు ఇవ్వడం చర్చనీయాశంగా మారింది. అక్రమంగా బైక్ టాక్సీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఈ బైక్ టాక్సీ సేవలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలలో భాగంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో నడుస్తున్న బైక్ టాక్సీ ప్లాట్‌ఫారమ్‌లపై జోక్యం చేసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ మే 12న సైబర్ విభాగానికి లేఖ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం మే 15 నాటి నోటీసులను జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 లోని సెక్షన్ 79(3)(b) ను ఉటంకిస్తూ జారీ చేసిన ఈ నోటీసులు, యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుండి సదరు అప్లికేషన్‌లను తొలగించి వాటి యాక్సెస్‌ను నిలిపివేయాలని కంపెనీలను ఆదేశించింది.
అగ్రిగేటర్లతోనే సమస్య:
ఈ అప్లికేషన్ల ద్వారా నిర్వహించబడుతున్న బైక్ టాక్సీ సేవలు చట్టవిరుద్ధమని మహారాష్ట్ర సైబర్ విభాగం పేర్కొంది. రవాణా శాఖ నిర్దేశించిన నియమ నిబంధనలను, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ ఆమోదం లేకుండా ఈ ప్లాట్‌ఫారమ్‌లు ప్రయాణీకుల రవాణా సేవలను నిర్వహిస్తున్నాయని నోటీసులలో ఆరోపించారు. డ్రైవర్ వెరిఫికేషన్ విధానాలు, ఇన్సూరెన్స్ సేఫ్టీ, మహిళల భద్రతా చర్యలు, అత్యవసర స్పందన వ్యవస్థలో లోపం ఉందని, ఇటీవల కాలంలో ఈ అప్లికేషన్లలో ఒకరిపై నమోదు చేసుకుని మరొకరి ద్వారా జరిగిన బైక్ టాక్సీ సేవ కారణంగా ఒక మహిళ మరణించిన తీవ్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై క్రిమినల్ కేసు నమోదైందని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కాన్సెప్ట్ పరంగా తాము బైక్ టాక్సీలకు వ్యతిరేకం కాదని, అయితే ప్రస్తుత సమస్య ఓలా, ఉబెర్, రాపిడో వంటి అగ్రిగేటర్లతోనే ఉందని సర్నాయక్ స్పష్టం చేశారు. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి అవసరమైన పత్రాలను సమర్పించడానికి తాత్కాలిక అనుమతులు ఇచ్చినప్పటికీ, వారు మహారాష్ట్ర ఈవీ బైక్ టాక్సీ విధానాన్ని పాటించడంలో విఫలమయ్యారని తన లేఖలో ఆరోపించారు. పాలసీ కేవలం ఈవీ బైక్ టాక్సీలనే అనుమతిస్తున్నప్పటికీ, రోడ్లపై వేలాది చట్టవిరుద్ధమైన, పెట్రోల్‌తో నడిచే బైక్ టాక్సీలను నడుపుతున్నారని, ఆర్టీఓ తనిఖీల సమయంలో విధించే జరిమానాలను తామే తిరిగి చెల్లిస్తామని (రీఇంబర్స్ చేస్తామని) రైడర్లకు రాపిడో సంస్థ ఒక కొత్త స్కీమ్‌ను పరిచయం చేసిందని సర్నాయక్ పేర్కొన్నారు.
తెలంగాణ, ఏపీలోను వివాదం:
యాప్ ఆధారిత బైక్ టాక్సీ (Bike Taxi) విధానం చట్టబద్ధతపై ఆయా రాష్ట్రాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఓలా, ఉబెర్, రాపిడో బైక్ టాక్సీలపై పూర్తి నిషేధం విధించగా ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం కేవలం ఎలక్ట్రిక్ బైక్ టాక్సీలను (EV Bike Taxis) మాత్రమే అనుమతించేలా కొత్త పాలసీని తీసుకువచ్చింది. కర్ణాటక ప్రభుత్వం వైట్ బోర్డ్ (వ్యక్తిగత) బైక్‌లను టాక్సీలుగా నడపడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. కేవలం ఎలక్ట్రిక్ బైక్ టాక్సీలకు మాత్రమే అనుమతిస్తూ పాలసీ తెచ్చినప్పటికీ, ప్రైవేట్ పెట్రోల్ బైక్ టాక్సీల ఆపరేషన్లపై నిరంతరం సీజ్ చర్యలు, జరిమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులోనూ ఈ అంశంపై వివాదం నడుస్తోంది. తెలంగాణ, ఏపీలోనూ ఈ అంశంపై వివాదం నడుస్తోంది. చట్టవిరుద్ధమైన బైక్ ట్యాక్సీల వల్ల తాము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్స్‌ను తొలగించాలంటూ యాపిల్, గూగుల్‌కు మహారాష్ట్ర సైబర్ విభాగం నోటీసులివ్వడం ఆసక్తిగా మారింది. అక్కడ ఒక వేళ నిజంగానే క్యాబ్, రైడ్ సేవలు నిలిచిపోతే మిగతా రాష్ట్రాలపై ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది.






