BYD Cars: అంతా తూచ్.. తెలంగాణకు షాకిచ్చిన చైనా కార్ల కంపెనీ

by Prasad Jukanti |

మా ప్లాంట్ తెలంగాణనే స్థాపించబోతున్నట్లు వచ్చిన వార్తలను బీవైడీ ఖండించింది.

BYD Cars: అంతా తూచ్..  తెలంగాణకు షాకిచ్చిన చైనా కార్ల కంపెనీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (Telangana state) తమ ఎలక్ట్రిక్ కార్ల యూనిట్ స్థాపించబోతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ (BYD) ఖండించింది. ఈ విషయంలో తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసినట్లు చైనా మీడియా పేర్కొంది. బీవైడీ కొన్నేళ్లుగా భారత్ లో తమ కార్యకలాపాలు సాగిస్తున్నా ఇక్కడ సొంత యనిట్లు లేవు. చైనాలో ఉత్పత్తి చేసి ఇక్కడికి దిగుమతి చేసుకుని విక్రయించడం వల్ల సుంకాల భారం కార్ల అమ్మకాలపై పడుతోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడే తయారు చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వంలో బీవైడీ గత కొంత కాలంగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్ సమీపంలో ప్లాంట్ స్థాపించేందుకు బీవైడీ సిద్ధం అయిందని ఇటీవల పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే దేశంలోనే ఈ సంస్థకు ఇది తొలి యూనిట్ కాబోతున్నదని స్పష్టం చేశాయి. అయితే ఈ కథనాల్లో వాస్తవం లేదని తాజాగా బీవైడీ స్పష్టం చేసింది. భారతదేశంలో అవకాశాలను అన్వేషిస్తున్నప్పటికీ హైదరాబాద్ లేదా మరెక్కడైనా తయారీ కేంద్రం గురించి ఎటువంటి ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించలేదని క్లారిటీ ఇచ్చింది.

మా వల్లే హైదరాబాద్ కు బీవైడీ: కేటీఆర్

ఇదిలా ఉంటే బీవైడీ ఎలక్ట్రికల్ కార్ల (Byd Electrical Car) ఉత్పత్తి యూనిట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన కథనాల నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ మా వల్లే రాష్ట్రంలో బీవైడీ ప్లాంట్ రాబోతున్నదని ఇటీవల వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో బీవైడీ సంస్థ కార్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నదని అన్నారు. బీవైడీ రాకకు ఏండ్ల తరబడి కష్టపడిన అందరికీ ఎక్స్ వేదికగా ఆయన అభినందనలు తెలిపారు.

Next Story