ఛత్రపతి శివాజీ విగ్రహం దహనం.. రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

by Malleboina Mahesh |

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్‌పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని దుండగులు తగలబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఛత్రపతి శివాజీ విగ్రహం దహనం.. రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్: ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని (Chhatrapati Shivaji Statue) దుండగులు తగలబెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్‌పల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. అయితే, రాజకీయ కక్షల కారణంగానే కొందరు దుండగులు కావాలని విగ్రహానికి నిప్పు పెట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో బంధన్‌పల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఆత్మగౌరవానికి ప్రతీకైన మహనీయుడి విగ్రహాన్ని అవమానించడం పై హిందూత్వ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు.

కాగా ఈ ఘటనపై స్పందించిన బీజేపీ తెలంగాణ (BJP Telangana) విభాగం నిప్పులు చెరిగింది. ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తగలబెట్టడం అత్యంత హేయమైన చర్య అని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అటకెక్కాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశద్రోహ పూరిత చర్యలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. రాజకీయ విభేదాల కోసం మహనీయుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకోవడం సమాజంలో చిచ్చు పెట్టడమేనని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించడంతో పాటు ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేయాలని డిమాండ్ బీజేపీ చేసింది.

Next Story