భూ సంస్కరణల ఆధ్యుడు బూర్గుల: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

by I. Sairam |

తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలను తీసుకువచ్చి జాగీర్ధార్, మక్తదారి వ్యవస్థలను నిర్మూలించి రైతులకు శతాబ్దాల దోపిడీ, వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించి, దేశానికి దశ దిశ నిర్దేశం చేసిన గొప్ప నాయకుడు బూర్గుల రామకృష్ణారావు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

భూ సంస్కరణల ఆధ్యుడు బూర్గుల: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, షాద్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలను తీసుకువచ్చి జాగీర్ధార్, మక్తదారి వ్యవస్థలను నిర్మూలించి రైతులకు శతాబ్దాల దోపిడీ, వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించి, దేశానికి దశ దిశ నిర్దేశం చేసిన గొప్ప నాయకుడు బూర్గుల రామకృష్ణారావు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150 సంవత్సరాల వార్షికోత్సవానికి శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నడయాడిన పాఠశాల 150 వ సంవత్సరం ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

బూర్గుల రామకృష్ణారావు పై తమకు భక్తిశ్రద్ధలతో కూడిన గౌరవ భావాలు ఉన్నాయని తెలిపారు. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు తీసుకున్న గొప్ప నిర్ణయాలు ఈనాడు సమాజంలో సామాజిక మార్పుకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. భూమికోసం భుక్తి కోసం, దున్నేవాడిదే భూమి, రాజు దైవాంశ సంభూతుడు భూమంతా వారిదే, భూమిని దున్నే ఏ రైతుకు హక్కు లేదు వంటి నినాదాలతో తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటంలో వచ్చిన నినాదాలనే చట్టాలుగా తెచ్చి రైతులకు భూమిపై హక్కులు కల్పించిన దేశంలోనే గర్వించదగ్గ గొప్ప ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని అన్నారు.

జాగీర్దార్, మక్తదారి వ్యవస్థలను నిర్మూలించి రైతులను శతాబ్దాల దోపిడీ నుంచి విముక్తి చేసి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించిన గొప్ప నాయకుడు బూర్గుల అని పేర్కొన్నారు. అప్పటివరకు భూములపై ఎలాంటి హక్కులు లేకుండా కూలీలుగా, పన్ను శిస్తూ చెల్లిస్తూ వచ్చిన వారేనని తెలిపారు. తెలంగాణలో టెనెన్సీ యాక్ట్ తీసుకువచ్చి భూ సంస్కరణలను తెచ్చిన గొప్ప అద్యుడు బూర్గుల రామకృష్ణారావు అని అన్నారు. తాను తీసుకువచ్చిన చట్టాలతో బూర్గుల రామకృష్ణారావు దేశానికి దశా దిశా నిర్దేశం చేశారని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు భూములపై అనేక హక్కులను తెచ్చాయని, వీటన్నిటికీ బూర్గుల వేసిన పునాదే కారణమని, భూ సంస్కరణలపై బూర్గుల తెచ్చిన చట్టాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడదగిన విషయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు బూర్గుల అని ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శనం అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Next Story