- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: బుల్లెట్ ట్రైన్ కారిడార్లపై సీఎస్ కీలక సమీక్ష!
హైదరాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, చెన్నై హైస్పీడ్ రైలు ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టబోతున్న మూడు భారీ హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్ ప్రాజెక్టుల తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. తెలంగాణను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదించిన మూడు భారీ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు రిపోర్టులు, ప్రాజెక్టు అమలులో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కలసి పనిచేయాలని, ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్:
హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధానించే హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు వలన తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సి.ఎస్ పేర్కొన్నారు. దేశంలో వేగవంతమైన రవాణా వ్యవస్థకు హై స్పీడ్ రైలు ప్రాజెక్టు నిలుస్తుందని, ప్రజల భవిష్యత్ అవసరాలకు, పారిశ్రామిక, ఐటి, పర్యాటక రంగాలలో అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుందని సి.ఎస్ తెలిపారు.
ఆ రూట్లలో డీపీఆర్ సిద్ధం:
హైదరాబాద్ – పూనే – ముంబై హై స్పీడ్ రైల్ మార్గానికి సంబంధించి డీపీఆర్ సిద్ధం అయ్యిందని రైల్వే అధికారులు తెలిపారు. సూమారు 671 కి. మీటర్ల మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, తెలంగాణ రాష్ట్రంలో 93 కి. మీటర్ల మేరకు భూ సేకరణ అవసరం ఉంటుందని, అదేవిధంగా హైదరాబాద్ – బెంగళూరు కారిడార్, హైదరాబాద్ – చెన్నై కారిడార్ లో సూమారు 123 కి.మీటర్ల నిడివిలో భూసేకరణ అవసరమని, కోకాపేట, శంషాబాద్ ప్రాంతాలలో రైల్వే డిపోలకు కొంత భూసేకరణ చేయాలని అధికారులు పేర్కొన్నారు. వీటికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ, హెచ్.యం.డి.ఎ, జీఎంఆర్ ఎయిర్ పోర్టు అధికారులు కేంద్ర రైల్వే ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేసుకొని హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ కు సహకరించాలని సీఎస్ అన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, HMDA మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, కేంద్ర రైల్వే శాఖ అధికారులు, జీఎంఆర్ ఎయిర్ పోర్టు అధికారులు పాల్గొన్నారు.






