ప్రభుత్వ భూమిలో బిల్డాక్స్ డ్రామా.. రంగులద్ది ప్రాజెక్ట్ ప్రచారం

by Naga Rani Yarlagadda |

శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట సర్వే నం.80లో బిల్డాక్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ ప్రాజెక్టు చేపడుతుందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. అయితే అక్కడ ఆ సంస్థకు ల్యాండ్ లేదని రెరా విచారణలో తేలింది. కేవలం ఆ ఏరియాలో స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు.

ప్రభుత్వ భూమిలో బిల్డాక్స్ డ్రామా.. రంగులద్ది ప్రాజెక్ట్ ప్రచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో/శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేటలో ప్రాజెక్టు అంటూ బిల్డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నది. డెవలప్ మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని ఒక స్థలంలో బ్లూషీట్స్, బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఆ ల్యాండ్ ను ప్రభుత్వ స్థలంగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. సర్వే నం.80లోని స్థలంగా నిర్ధారించారు. తొలుత తాత్సారం చేసినా.. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇటీవల అక్కడున్న కంపెనీ బోర్డులకు అధికారులు రంగు పూసేశారు. సదరు కంపెనీ పేరు కనబడకుండా చేశారు. కానీ బ్లూ షీట్లను తొలగించకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది. సర్వే నం.80లోని స్థలమంతా వివాదాస్పదమే. పైగా అది ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బిల్డాక్స్ కంపెనీ బ్లూ షీట్లు ఏర్పాటు చేసి, సదరు ల్యాండ్ తమదంటూ బోర్డులు ఏర్పాటు చేయడం వెనుక కొందరు పెద్దలు ఉన్నారని, అందుకే తదుపరి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగపడే స్థలాల సంరక్షణకు అక్కడి ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

వివాదాస్పద భూముల్లోనే..

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ అనేక ల్యాండ్ పార్శిళ్లు ఉన్నాయి. వందలాది ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం పలు కేసులు, వివాదాలు ఉన్న స్థలాల్లోనే అగ్రిమెంట్లు కుదుర్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ప్రధానంగా హఫీజ్ పేటలోని సీఎస్ 14 భూములపై పలు కేసులు పెండింగులో ఉన్నాయి. ఈ విషయం రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నుంచి సీఎస్ వరకు, చిన్న బిల్డర్ నుంచి బడా కంపెనీ యజమాని వరకు తెలుసు. అయినా మ్యుటేషన్లు, ఎన్వోసీల కోసం దరఖాస్తు చేయడం, రిజెక్ట్ కావడం సాధారణంగానే చోటు చేసుకుంటున్నాయి. గతేడాది కూడా సర్వే నం.80లోని 55 ఎకరాలను కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఒకరి చేత రెండు ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన ఎన్వోసీ కోసం దరఖాస్తు సమర్పించారు. ఈ ఫైల్ ను రిజెక్ట్ చేస్తారని కూడా వాళ్లకు తెలుసు. అయితే రిపోర్టులో ఆది నుంచి ఏమేం జరిగిందో రాసే క్రమంలో వాళ్లకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకుంటున్నారని ఆరోపణలు వినిపించాయి. అందుకే మ్యుటేషన్, ఎన్వోసీకి అవకాశం లేదని తెలిసినా.. పలువురు దరఖాస్తులు సమర్పిస్తూనే ఉన్నారు. హఫీజ్ పేట సర్వే నంబర్ 77 నుంచి 80 వరకు వివాదం నడుస్తూనే ఉంటుంది. వాటి పక్కనా అనేక చిక్కుముళ్లు. ఇక్కడి భూముల విలువ ప్రభుత్వం వేలం వేస్తే ఎకరం రూ.60 కోట్లకు పైగానే పలుకుతాయి. సర్వే నంబర్ 80 కింద 484.31 ఎకరాల భూమి ఉంటుంది. భూ భారతి వెబ్ సైట్ లో ఇదే సర్వే నెంబరును కొట్టి చూస్తే ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని ఉంటుంది.

రెరా నోటీసులు.. జరిమానా

శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట సర్వే నం.80లో బిల్డాక్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ ప్రాజెక్టు చేపడుతుందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. అయితే అక్కడ ఆ సంస్థకు ల్యాండ్ లేదని రెరా విచారణలో తేలింది. కేవలం ఆ ఏరియాలో స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. ఇదే విషయాన్ని ‘దిశ’ గత మార్చి ఒకటో తేదీన ‘బిల్డాక్స్.. ప్రీ లాంచ్! చదరపు అడుగు ధర కేవలం రూ.4699 మాత్రమే. సోషల్ మీడియా ద్వారా ఏజెంట్ల ప్రచారం’ అంటూ కథనాన్ని పబ్లిష్ చేసి కస్టమర్లను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి బిల్డాక్స్ సంస్థకు రెరా షోకాజ్ నోటీసులు జారీ చేస్తూనే ఉన్నది. తాజాగా సమగ్ర విచారణ చేసి పెనాల్టీ విధించింది. కొందరు కస్టమర్లు కూడా ఈ సోషల్ మీడియా ప్రకటనల ద్వారా బిల్డాక్స్ ప్రాజెక్టు గురించి ఆరా తీశారు. వాట్సాప్ ద్వారా చాట్ చేసి వివరాలు రాబట్టారు. హఫీజ్ పేట సర్వే నం.80లోనే ప్రాజెక్టు, కొండాపూర్ ఏరియా అంటూ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్, ఫ్లోర్ ప్లాన్ వంటివి కూడా కస్టమర్ కి షేర్ చేశారు. అవన్నీ రెరాకు సమర్పించారు. కొందరు ఆశ పడి రూ.లక్షల్లో చెల్లించినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణలో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు తేలింది. 30 రోజుల్లో పెనాల్టీ చెల్లించాలని బిల్డాక్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని రెరా అథారిటీ గతంలోనూ ఆదేశించింది. పెనాల్టీ ఆర్డర్ నం.1626/2023, తేదీ.4.4.2024 ద్వారా రెరా చైర్ పర్సన్ డా.ఎన్.సత్యనారాయణ, సభ్యులు కె.శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ జన్ను అపరాధ రుసుం కట్టాలని స్పష్టం చేశారు. తాజాగా ఫిర్యాదు నం.520/2024లోనూ జరిమానా విధించడం గమనార్హం.

కంపెనీ బోర్డులు తొలగించాం - వెంకారెడ్డి, తహసీల్దార్, శేరిలింగంపల్లి

హఫీజ్ పేట సర్వే నం.80 ప్రభుత్వ స్థలమే. అక్కడ బిల్డాక్స్ అనే కంపెనీ తాము డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని చెప్పి బ్లూ షీట్లు ఏర్పాటు చేసి బోర్డులు పెట్టుకున్నది. అయితే మా ఫీల్డ్ స్టాఫ్ కంపెనీ బోర్డులు తొలగించారు. బ్లూ షీట్లపై రాసిన పేర్లను చెరిపేశారు. త్వరలో తదుపరి చర్యలు తీసుకుంటాం.

Next Story