వివాదాస్పద భూముల్లో ‘బిల్డాక్స్’ దందా..! హఫీజ్‌పేట, కొండాపూర్‌లో ప్రాజెక్ట్

by Kema Shiva Kumar |

‘చదరపు అడుగు ధర రూ.4,699 మాత్రమే.. ఈ ఆఫర్ రెండు వారాలే.’ అంటూ బిల్డాక్స్ కంపెనీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నది.

వివాదాస్పద భూముల్లో ‘బిల్డాక్స్’ దందా..! హఫీజ్‌పేట, కొండాపూర్‌లో ప్రాజెక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘చదరపు అడుగు ధర రూ.4,699 మాత్రమే.. ఈ ఆఫర్ రెండు వారాలే.’ అంటూ బిల్డాక్స్ కంపెనీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నది. ‘అతి తక్కువ ధరకే’ అంటూ ఫేస్ బుక్ పేజీలు, వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నది. కొండాపూర్, హఫీజ్‌పేట ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకుండా, సరైన డాక్యుమెంట్స్, పర్మిషన్స్, అప్రూవల్స్ లేకుండా ఫ్లాట్లను విక్రయిస్తున్నది. దీంతో ఓ వినియోగదారుడు దీనిపై రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ (రెరా)కు ఫిర్యాదు చేయగా, జరిమానా విధించడంతో పాటు కస్టమర్ల నుంచి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించాలని రెరా.. కంపెనీని ఆదేశించింది.

సోషల్ మీడియా ద్వారా..

ప్రీ లాంచ్ ఆఫర్ కింద కొండాపూర్‌లో మార్కెట్ ధర కంటే అతి తక్కువకు ఫ్లాట్లు అమ్ముతున్నారంటూ ఫేస్‌బుక్‌లో పేజీని ఓపెన్ చేశారు. వాట్సాప్‌లోనూ చాట్ చేస్తున్నారు. ఓ వ్యక్తి బిల్డాక్స్ సేల్స్ టీమ్ సభ్యుడినని ప్రచారం చేస్తున్నారు. ఆయన కొండాపూర్/హఫీజ్‌పేట ప్రాంతాల్లో బిల్డాక్స్ చేపడుతున్న ప్రాజెక్టుల గురించి కస్టమర్లకు వివరిస్తున్నారు. అందులోనే టవర్, ఫ్లోర్ ప్లాన్ వంటివి షేర్ చేస్తున్నారు. కొండాపూర్‌లోని మై హోం మంగళకు ఎదురుగానే అంటూ ప్రాజెక్టు పేరును ‘ది కాంటినెంట్’గా పెట్టారు. బుకింగ్ అడ్వాన్స్ అమౌంట్ రూ.10 లక్షలు చెల్లిస్తే మిగతా అమౌంట్ నెల రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందంటున్నారు.

వినియోగదారుడి ఫిర్యాదు..

రెరా అనుమతి లేకుండా ‘బిల్డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కొండాపూర్‌లో ది కాంటినెంట్ పేరుతో ప్రాజెక్టు చేపట్టి, మార్కెటింగ్ చేయడంతో పాటు బుకింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నదని శరత్ అనే వ్యక్తి రెరాలో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి ఫేస్‌బుక్‌లో చూశానని, కమల్ అనే వ్యక్తితో వాట్సాప్ చాట్‌తో వివరాలు తెలుసుకున్నానని వివరించారు. అనంతరం కంపెనీ అమ్మకాలు పర్యవేక్షిస్తున్న హెక్సాస్కీ ఇన్ ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్ దామోదర ప్రసాద్‌తో మాట్లాడి ఫ్లాట్ బుకింగ్ చేసుకున్నట్టు వివరించారు. 2028లోగా ప్రాజెక్టు పూర్తి చేసి డెలివరీ ఇస్తామని చెప్పడంతో బుకింగ్ నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2 లక్షలు చెల్లించినట్టు శరత్ తెలిపారు. అయితే ఆ ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని, ఆ ప్రాజెక్టు సైట్ సైతం లిటిగేషన్‌లో ఉందనే విషయం తెలియడంతో రెరాను ఆశ్రయించాడు. కాగా మై హోం మంగళ ప్రాజెక్టు ఎదురుగా ఎలాంటి నిర్మాణాలు లేవని, అయితే ఇప్పటికే 55 ఫ్లాట్లు అంటే లక్ష చదరపు గజాలు అమ్మేసినట్లు కంపెనీ వ్యవహారాలు పర్యవేక్షించే హెక్సాస్కి ప్రతినిధులు చెబుతున్నారని వినియోగదారుడు పేర్కొన్నాడు.

సాక్ష్యాలతో బురిడీ

‘హఫీజ్ పేట కాంటినెంట్.. ప్రాజెక్టులో మొత్తం 4 వేల ఫ్లాట్లు. 1800, 2100, 2600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ట్రిపుల్ బెడ్‌రూం, 3500 చ.అ.ల విస్తీర్ణంలో ఫోర్ బెడ్‌రూం ఫ్లాట్లు. ప్రాజెక్టు బిల్టప్ ఏరియా 1.35 కోట్ల చ.అ.ల విస్తీర్ణం’ అంటూ హెక్సాస్కి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ చెప్పారు. వీటిని ఎలా నమ్మాలని కస్టమర్లు అడిగితే ఇతర కస్టమర్లు బి.మల్లిఖార్జున్, డి.పవన్ కుమార్, ప్రదీప్ కుమార్ చెల్లించిన రూ.15 లక్షలు ఆధారాలు చూపారు. వారికి టవర్ 2, 16 ఫ్లోర్ లో యూనిట్ 8 ని అలాట్ చేసినట్లు రికార్డులు చూపించారు. బిల్డాక్స్ ప్రాజెక్టులు నిజమేనని కస్టమర్స్ నమ్మారు. దాంతో ఫిబ్రవరి ఏడో తేదీన రూ.2 లక్షలు చెల్లించారు. అది కూడా ఆర్టీజీఎస్ ద్వారా కట్టారు. మిగతా రూ.8 లక్షలు కడతామన్నారు. దాంతో టవర్ 2లో 12 ఫ్లోర్ లోని యూనిట్ 9ని కేటాయించారు. దాంట్లో హఫీజ్ పేట ‘ది కాంటినెంట్’గా పేర్కొన్నారు. ఆ తర్వాత ఎలాంటి అనుమతులూ లేవు. అనుమతులు, అప్రూవల్స్ రాలేదు. అసలు ల్యాండ్ టైటిల్ లేదు. కనీసం డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు సైతం లేవు. కానీ కొండాపూర్/హఫీజ్‌పేట ల్యాండ్ అంటూ ప్రచారం చేసి డబ్బులు కట్టించుకున్నారని గ్రహించారు. హఫీజ్ పేట సర్వే నం.80 ల్యాండ్ మీద సుప్రీంకోర్టులోనూ కేసులు ఉన్నట్లు తెలిసింది. దాంతో రెరాకి ఫిర్యాదు చేశారు.

ఆరోపణలను తోసిపుచ్చినా..

ఫిర్యాదుదారు ఆరోపణలను బిల్డాక్స్ తోసిపుచ్చింది. ఫేస్ బుక్ అడ్వర్టైజింగ్ గురించి తమకు తెలియదని, అదంతా మోసమని పేర్కొంది. తమ కంపెనీ నుంచి ది కాంటినెంట్ పేరుతో ఎలాంటి ప్రాజెక్టూ లేదని తెలిపింది. అలాగే కమల్, దామోదర ప్రసాద్ అనే వ్యక్తులతో తమకు సంబంధం లేదని వివరించింది. ప్రాజెక్టుకు సంబంధించి తాము ఎలాంటి మొత్తం తీసుకోలేదని స్పష్టం చేసింది. అయితే, తాము ఫిర్యాదుదారుకు రూ.2 లక్షలు చెల్లించేందుకు ప్రయత్నించగా.. ఆయన తమను బ్లాక్ చేయడంతో వీలుపడలేదని తెలిపింది. అయితే బ్యాంక్ స్టేట్ మెంట్లు సమర్పించాలనే ఆదేశాలు పాటించకపోవడంతో బిల్డాక్స్ సంస్థే అక్రమాలకు పాల్పడినట్టు రెరా నిర్ధారించింది.

జరిమానా, అడ్వాన్స్ వాపస్ : రెరా ఆదేశాలు

శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట సర్వే నం.80లో బిల్డాక్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ ప్రాజెక్టు చేపడుతుందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. అయితే అక్కడ ఈ సంస్థకు ల్యాండ్ లేదని రెరా విచారణలో తేలింది. కేవలం ఆ ఏరియాలో స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. ఇదే విషయాన్ని ‘దిశ’ మార్చి ఒకటో తేదీన ‘బిల్డాక్స్.. ప్రీ లాంచ్! చదరపు అడుగు ధర కేవలం రూ.4699 మాత్రమే. సోషల్ మీడియా ద్వారా ఏజెంట్ల ప్రచారం’ అంటూ కథనాన్ని పబ్లిష్ చేసి కస్టమర్లను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి బిల్డాక్స్ సంస్థకు రెరా షోకాజ్ నోటీసులు, నోటీసులు జారీ చేస్తూనే ఉన్నది. తాజాగా సమగ్ర విచారణ జరిపి ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఫ్లాట్ల విక్రయానికి బుకింగ్స్ చేస్తున్న బిల్డర్ పై రెరా కన్నెర్ర చేసింది. నిబంధనలు ఉల్లంఘించి బుకింగ్స్ చేస్తున్నందుకు రూ.1.6 లక్షల జరిమానా విధించింది. అలాగే ఫిర్యాదుదారుడు ఫ్లాట్ కొనుగోలు కోసం అడ్వాన్స్ గా చెల్లించిన రూ.2 లక్షలను పదిహేను రోజుల్లోగా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. పర్మిషన్స్ తీసుకోకుండా ప్రాజెక్టు మార్కెటింగ్, బుకింగ్ అమౌంట్స్ తీసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.

గతంలోనూ పెనాల్టీ

కొందరు కస్టమర్లు కూడా సోషల్ మీడియా ప్రకటనల ద్వారా బిల్డాక్స్ ప్రాజెక్టు గురించి ఆరా తీశారు. వాట్సాప్ ద్వారా చాట్ చేసి వివరాలు రాబట్టారు. హఫీజ్ పేట సర్వే నం.80లోనే ప్రాజెక్టు అంటూ కొండాపూర్ ఏరియా అంటూ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్, ఫ్లోర్ ప్లాన్ వంటివి కూడా కస్టమర్ కి షేర్ చేశారు. అవన్నీ రెరాకు సమర్పించారు. కొందరు ఆశ పడి రూ.లక్షల్లో చెల్లించినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణలో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు తేలింది. 30 రోజుల్లో పెనాల్టీ చెల్లించాలని బిల్డాక్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని రెరా అథారిటీ గతంలోనూ ఆదేశించింది. పెనాల్టీ ఆర్డర్ నం.1626/2023, తేదీ.4.4.2024 ద్వారా రెరా చైర్ పర్సన్ డా.ఎన్.సత్యనారాయణ, సభ్యులు కె.శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ జన్ను అపరాధ రుసుం కట్టాలని స్పష్టం చేశారు. తాజాగా ఫిర్యాదు నం.520/2024లోనూ జరిమానా విధించడం గమనార్హం.

బిల్డాక్స్ వెనక ఉన్నదెవరు?

బిల్డాక్స్ అనే పెద్ద కంపెనీ ప్రీలాంచ్ ఆఫర్లతో ఫ్లాట్లు విక్రయిస్తున్నదంటూ చాలా రోజుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే దీని వెనుక ఎవరో పెద్ద రాజకీయ నాయకుడు ఉండడం వల్లే వివాదాస్పద భూములను చూపించి ప్రాజెక్టులు కడుతున్నామంటూ ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నాయకుడి అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే రెరా పెనాల్టీ విధించినా.. ఆ కంపెనీ హోర్డింగ్స్ మాత్రం చాలా చోట్ల కనిపిస్తున్నాయి. చాలా చోట్ల సర్కిళ్లల్లో పోలీసులు కూర్చునేందుకు వినియోగించే వాటిపైనా బిల్డాక్స్ పేరిట బోర్డులు ఉండడం గమనార్హం.

Next Story