బనకచర్లపై జంగ్ సైరన్ మోగిస్తాం: గెల్లు శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

బనకచర్లపై జంగ్ సైరన్ మోగిస్తామని.. అందుకే ఈ నెల 26న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర సదస్సు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్

బనకచర్లపై జంగ్ సైరన్ మోగిస్తాం: గెల్లు శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బనకచర్లపై జంగ్ సైరన్ మోగిస్తామని.. అందుకే ఈ నెల 26న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర సదస్సు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సదస్సులో బనకచర్లపైనే ప్రధానంగా చర్చిస్తామని, బనకచర్లపై విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందని చెప్పారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బనకచర్లతో తెలంగాణకు జరిగే నష్టాన్ని తమ విద్యార్థి నేతలు ప్రతీ కాలేజీకి వెళ్లి వివరిస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఐదు లక్షల కరపత్రాలు ముద్రించామని.. విద్యార్థులను కలిసి తెలంగాణకు బనకచర్లతో జరుగుతున్న నష్టాన్ని కరపత్రాలతో వివరిస్తామన్నారు. చంద్రబాబు, మోడీ, రేవంత్‌రెడ్డి కలిసి తెలంగాణ నీటి వనరులను కొల్లగొడుతున్న తీరును వివరిస్తామని చెప్పారు. ఉదయం పది గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుందని.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి..హరీశ్‌రావు ఉదయం సెషన్‌లో పాల్గొంటారని తెలిపారు.

మధ్యాహ్నం మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సాయంత్రం సెషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు విద్యార్థి విభాగం సన్నద్ధం అవుతున్నదని చెప్పారు. గోదావరి నదీ జలాలపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని.. తన గురువుకు ధారాదత్తం చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రగతి కుంటుపడిందని, మళ్లీ ఇందిరమ్మ ఎమర్జెన్సీ వచ్చిందని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి ఊడిగం చేస్తూ చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు విద్యార్థి విభాగం నేతలను సన్నద్ధం చేసేందుకు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నేతలు కుక్కిన పేనులా ఉన్నారని.. పులిని పండబెట్టి పిల్లిని గెలిపించడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, చిరుమళ్ల రాకేష్‌కుమార్, ఆంజనేయగౌడ్, ధర్మేందర్ రెడ్డి, తుంగబాలు, కడారి స్వామియాదవ్, కృష్ణ పాల్గొన్నారు.

Next Story