BRSV: బీఆర్ఎస్వీ ‘జంగ్ సైరన్’.. బనకచర్ల అంశంపై రాష్ట్రవ్యాప్త పోరాటం

by Ramesh Naini |

తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్వీ ‘జంగ్ సైరన్’ మోగించింది.

BRSV: బీఆర్ఎస్వీ ‘జంగ్ సైరన్’.. బనకచర్ల అంశంపై రాష్ట్రవ్యాప్త పోరాటం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నీటి హక్కుల కోసం (BRSV) బీఆర్ఎస్వీ ‘జంగ్ సైరన్’ మోగించింది. బనకచర్ల (banakacherla) ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ (BRS) విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్త పోరాటానికి సిద్దమైంది. రాష్ట్రంలోని ప్రతి కాలేజీ, ప్రతి విద్యార్థికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని కరపత్రాల ద్వారా వివరించి చైతన్యం చేయాలనే ఉద్దేశంతో నేటి నుంచి 5 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటిలో బనకచర్ల ప్రాజెక్టు వలన రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని విద్యార్థులకు శాంతియుతంగా వివరిస్తుంటే పోలీసులు అడ్డుకుని, అక్రమంగా విద్యార్థి నాయకులను అరెస్టు చేసినట్లు బీఆర్ఎస్ తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు బాలు, కడారి స్వామి యాదవ్, పడాల సతీష్, బీఆర్ఎస్వీ నాయకులు తదితర విద్యార్ధి నాయకులు ఉన్నారు.

బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి శాఖ విద్యార్థులను కలిసిన సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ విద్యార్థులతో మాట్లాడారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కేంద్రంలోని కూకట్‌పల్లి ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులకు బనకచర్ల అంశంపై గురించి విద్యార్థులతో మాట్లాడారు. హైదరాబాద్ లోని స్థానిక ఇంటర్ జూనియర్ కాలేజీలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్వీ నాయకులు కరపత్రాలు పంచారు.

పాలమూరు విశ్వవిద్యాలయంలో బీఆర్ఎస్వీ నాయకులు యూనివర్సిటీ ఫార్మసి కాలేజ్ విద్యార్థులకు బనకచర్ల ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కళాశాలలోని విద్యార్థులకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు కరపత్రాలు పంచారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బనకచర్ల అంశంపై విద్యార్థులకు వివరించారు. అదే విధంగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కరీంనగర్, కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థులకు అవగాహనా సదస్సులు నిర్వహించారు.

Next Story