- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: నాలుగు రోజుల్లో అన్ని ఆధారాలతో బయటపెడుతా
‘నన్ను అరెస్టు చేస్తారని కాంగ్రెస్ నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నేను పదేళ్లు మంత్రిగా చేశాను.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నన్ను అరెస్టు చేస్తారని కాంగ్రెస్ నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నేను పదేళ్లు మంత్రిగా చేశాను. లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని చెప్పాను. నా నిజాయితీకి భయం లేదు. అరెస్టు చేసుకుంటే చేసుకోమనండి. రేవంత్‌రెడ్డికి పైశాచిక ఆనందం కలిగితే కలగనీయండి. కానీ.. ప్రజల పక్షాన వృద్ధులకు రూ.4,000 పెన్షన్, ఆడబిడ్డలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారని అడుగుతూనే ఉంటాం’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు, అహంకారపూరిత, నియంతృత్వ పోకడల కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్‌టీ హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధంతరంగా వైదొలగిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ బాధ్యతారాహిత్య, అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై ఒక్కరోజే ఏకంగా రూ.15 వేల కోట్ల అప్పుల భారం పడిందని విమర్శించారు. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్‌ను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా, తామే మరమ్మతులు చేస్తామని ఆ సంస్థ ముందుకురావడమే రేవంత్‌రెడ్డికి కంటగింపుగా మారిందని, అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి, రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు.
అప్పటి నుంచే పంచాయితీ మొదలు
తాము అధికారం నుంచి దిగిపోయే ముందు, హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించామని కేటీఆర్ వెల్లడించారు. ఓఆర్ఆర్ చుట్టూ 160 కి.మీ., భువనగిరి, సంగారెడ్డి, షాద్‌నగర్, కడ్తాల్ వరకు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపామని.. అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తిచేసి, కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించామని అన్నారు. భూసేకరణ అవసరం లేకుండా, పిల్లర్లు లేకుండా భూమ్మీదనే నిర్మించేలా డిజైన్ చేశామని.. కానీ, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్న మొదటి అనాలోచిత నిర్ణయం ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు అని ఆరోపించారు. తన భూములు ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలకు లబ్ధి చేకూరుతుందని పిచ్చిపిచ్చి ఆరోపణలతో ప్రాజెక్టును రద్దు చేసి ఎల్అండ్‌టీపై మొదటి దెబ్బ వేశారని.. అప్పటి నుంచే సీఎంకు, ఆ సంస్థకు మధ్య పంచాయితీ మొదలైందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో తమ రాజకీయ లబ్ధికి సహకరించలేదనే కోపంతో సీఎం ఆ సంస్థపై పగబట్టారని అన్నారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో టెండర్ వేసిన ఎల్అండ్‌టీకి క్వాలిఫికేషన్ లేదని చెప్పి, తన అనుచరుడైన బాంబులేటి శ్రీనివాసరెడ్డి సంస్థకు పనులు కట్టబెట్టారని ఆరోపించారు. మేడిగడ్డ కూలిపోయిందని చెప్పకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరించారని అన్నారు. ఈ కక్ష సాధింపు చర్యలు భరించలేకే 2070 వరకు లీజు ఉన్న ఎల్అండ్‌టీ సంస్థ రాష్ట్రం నుంచి వాకౌట్ చేసిందన్నారు. తెలంగాణ రైజింగ్ అని చెప్పుకొనే సీఎం.. పెట్టుబడులకు స్వర్గధామమైన రాష్ట్రం నుంచి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఎందుకు పారిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
280 ఎకరాల భూములపై సీఎం కన్ను
ఆరు గ్యారెంటీల అమలుకు పైసల్లేవంటుండగా.. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రైవేటు సంస్థ మోస్తున్న భారాన్ని ప్రభుత్వం నెత్తికెత్తుకొని రూ.15 వేల కోట్ల అప్పు చేయడం దేనికి? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రం ఇప్పటికే రూ.2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని, దానికి ఈ రూ.15 వేల కోట్లు అదనమని అన్నారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని.. ఎల్అండ్‌టీకి కేటాయించిన 280 ఎకరాల విలువైన భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి, ఆయన సన్నిహితుల కన్ను పడిందని ఆరోపించారు. ఆ భూములను అడ్డగోలుగా అమ్ముకోవడానికి లేదా తమ అనుయాయులకు చెందిన సంస్థలకు కట్టబెట్టడానికే ఈ స్కెచ్ వేశారన్నారు. ఇప్పటికే ఉన్న మాల్స్‌ను ఎవరెవరికి రాసిస్తారో త్వరలోనే చూస్తారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఏం చేసినా దాని వెనుక ఒక స్కీమ్, ఒక స్కామ్ ఉంటుందని ఆరోపించారు. ఈ నిర్ణయంలో పారదర్శకత లేదని.. కనీసం కేబినెట్ సబ్ కమిటీ వేయలేదని.. కేబినెట్‌లో చర్చించలేదని అన్నారు. ‘చట్ మంగ్నీ, ఫట్ షాదీ’ అన్నట్టు నిర్ణయం తీసుకున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తాము సృష్టించిన రూ.20 వేల కోట్ల ఆస్తిని కాంగ్రెస్ చేతిలో పెడితే, ఈ ప్రభుత్వం మాత్రం రూ.15 వేల కోట్ల అప్పును ప్రజలపై రుద్దడాన్ని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. హైడ్రా అనే భూతంతో రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీశారని.. బ్లాక్ మెయిల్, బ్లాక్ మెయిలర్స్‌కు హైడ్రానే కేంద్రంగా మారిందని ఆరోపించారు. మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతానని కేటీఆర్ వెల్లడించారు. అలాగే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్‌కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.






