రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది : సీఎం రేవంత్, రాహుల్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ భూములను లాక్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే మొదటిసారి కాదని, రాష్ట్రంలో ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది : సీఎం రేవంత్, రాహుల్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ భూములను లాక్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే మొదటిసారి కాదని, రాష్ట్రంలో ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని నందినగర్లో ఉన్న నివాసంలో.. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) విద్యార్థులు కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కేటీఆర్ తో విద్యార్థులు చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. జయశంకర్ వర్సిటీ నుంచి వంద ఎకరాలు లాక్కున్నారని, వర్సిటీ భూములపై విద్యార్థులు పోరాడినా.. ఆ ఆందోళనను ప్రభుత్వ వర్గాలు అణచివేశాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో HCUకు చెందిన 400 ఎకరాల భూములపై వెనక్కి తగ్గారన్నారు. బడేబాయ్ చోటే బాయ్ ప్రభుత్వాన్ని నడిపిస్తూ వరుసగా భూముల్ని గుంజుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉందని తీవ్రంగా విమర్శించారు. ఉర్దూ యూనివర్సిటీలోని 50 ఎకరాలపై రేవంత్ కన్నుపడిందని, దానిని కాపాడుకునేందుకు ఢిల్లీలో పోరాటం చేస్తామని తెలిపారు. మనూ భూముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మైనార్టీల రక్షకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఈ విషయంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చారని, ఉద్యోగాలు లేక అశోక్ నగర్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో రాహుల్ గాంధీ వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. రాహుల్ ఒక చేతగాని సన్యాసి అని ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి రూ.10 వేల కోట్ల స్కామ్ కు కేంద్రం అండగా ఉందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story