కరీంనగర్ జిల్లాలో కారు సునామీ ఖాయం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

by Ajay Maddhiboyina |

పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై కదంతొక్కాలని పిలుపునిచ్చారు. బుధవారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం అయ్యారు.

కరీంనగర్ జిల్లాలో కారు సునామీ ఖాయం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై కదంతొక్కాలని పిలుపునిచ్చారు. బుధవారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలపై, సమకాలీన రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కరీంనగర్ మొదటి నుంచీ బీఆర్ఎస్‌కు ఒక కోట మాదిరిగా అండగా నిలబడిందని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు, మోసాలతో కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. అయితే.. కాంగ్రెస్ రెండున్నర ఏళ్ల విఫల పరిపాలన తర్వాత తిరిగి ప్రజలంతా బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ జిల్లాలో అత్యంత కీలకమైన సింగరేణిపై అటు బీజేపీ, కాంగ్రెస్ కలిసిచేస్తున్న కుట్రలను, అవినీతిని ఎక్కడికక్కడ ప్రజల ముందుకు, కార్మికుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. వారి అరాచకాలను, అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని సూచించారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి బూత్‌ల వారీగా ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలన్నారు.

కేవలం గ్రామస్థాయి పార్టీ కార్యాచరణ కాకుండా బూత్‌ల వారీగా బలోపేతం చేసుకుంటూ సాగాలన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రతీ కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకోవాలన్నారు. పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా బూత్‌ల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని కోరారు. కరీంనగర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుందని మనం గతంలో చెప్పిన విషయం ముమ్మాటికీ నిజమవుతున్నదని.. ఇప్పటికే దాదాపు రెండు వారాలు దాటిపోయినా వర్షాలు పడని ఈ పరిస్థితిలోనూ పుష్కలంగా నీరు కాళేశ్వరంలో పారుతున్నదని చెప్పారు. అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి నుంచి పదివేల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నదని.. ఎత్తిపోసి రైతన్నల నారుమడులకు అందించాలన్న కనీస సోయి కూడా లేకపోవడం రైతు వ్యతిరేక విధానాలకు అద్దం పడుతుందన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు అందిన కాడికి దోచుకుంటున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలన్నారు. పార్టీ నేతలంతా మారుతున్న కాలానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల శక్తిని అర్థం చేసుకొని.. వాటి ద్వారా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియాను బలంగా ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం నియోజకవర్గాల వారిగా పార్టీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్‌పై జరుగుతున్న కార్యక్రమాల అడిగి తెలుసుకున్నారు.

Next Story