ఎస్ఐఆర్, సభ్యత్వం నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో పట్టు కోసం బీఆర్ఎస్ వ్యూహాలు. ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని డివిజన్ల వారీగా కేడర్‌కు శిక్షణ ఇస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఎస్ఐఆర్, సభ్యత్వం నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ క్రమంగా సంస్థాగత బలోపేతంపై దృష్టి పెడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మరోసారి పార్టీకి ప్రధాన బలంగా మార్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఒకవైపు ఎస్ఐఆర్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ రెండు అంశాలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా హైదరాబాద్ మహానగరంలోని అన్ని డివిజన్లలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌కు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ నిర్మాణం, కేడర్ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు లక్ష్యాలపై కేటీఆర్ నేరుగా నాయకులతో చర్చిస్తున్నారు. ప్రతి డివిజన్‌లో పార్టీ బలాబలాలను అంచనా వేస్తూ, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

సభ్యత్వ నమోదుకు భారీ ప్లాన్

బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. అయితే.. ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాధారణ ప్రక్రియగా కాకుండా, పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంగా తీసుకుంది. గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు పార్టీకి చురుకైన కార్యకర్తలను గుర్తించడం, కొత్తవారిని చేర్చుకోవడం, పాత కేడర్‌ను మళ్లీ యాక్టివ్ చేయడం ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించింది. అంతేకాకుండా.. పూర్తిస్థాయిలో డిజిటల్ ప్రక్రియలో సభ్యత్వ నమోదు ప్రక్రియను నిర్వహించనున్నారు. నగర ప్రాంతాల్లో యువత, మహిళలు, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించేలా ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా టీమ్స్, డిజిటల్ క్యాంపెయిన్లు, బూత్ కమిటీల సమన్వయంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

డివిజన్ల వారీగా కేటీఆర్ ఫోకస్..

హైదరాబాద్ నగర రాజకీయాల్లో బీఆర్ఎస్‌కు ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా కేటీఆర్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో నగరంలో బీఆర్ఎస్‌కు ఉన్న బలమైన పట్టును మళ్లీ కొనసాగించాలనే ఉద్దేశంతో కేడర్‌ను ఆ దిశగానే సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రతీ డివిజన్‌లో ఎంతమంది సభ్యులను చేర్చాలి, బూత్ స్థాయిలో ఎలాంటి టీమ్స్ ఏర్పాటు చేయాలి, ప్రజల్లో పార్టీపై మళ్లీ విశ్వాసం ఎలా పెంచాలి వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారనే అభిప్రాయం నేపథ్యంలో వారిని మళ్లీ చురుకుగా మార్చేందుకు కేటీఆర్ ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచేందుకు సైతం ఈ సమావేశాలు ఉపయోగపడుతున్నాయని అంటున్నారు.

కేడర్‌కు ప్రత్యేక శిక్షణ..

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కో-ఆర్డినేటర్ల పాత్ర కీలకం కావడంతో ఇప్పటికే జిల్లాల వారీగా నియామకాలు పూర్తయ్యాయి. అంతేకాక నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను సైతం పార్టీ ప్రకటించింది. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కాబోతోంది. వీటన్నింటి దృష్ట్యా హైదరాబాద్ నగరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ.. డివిజన్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శిక్షణలో పాల్గొని కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎస్ఐఆర్‌పై శిక్షణనిస్తూనే.. సభ్యత్వ నమోదు పైన అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడ కూడా పార్టీ ఓట్లను మిస్ కాకుండా.. ఎలా వ్యవహరించాలో సూచిస్తున్నారు. అంతేకాకుండా.. త్వరలోనే సభ్యత్వ నమోదుకు యాప్ రానున్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలో సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

Next Story