రాజ్యసభలో హెల్త్ ​అండ్​ నేషనల్ ​సెక్యూరిటీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఎంపీ వద్దిరాజు కీలక ప్రసంగం

by Ramesh Naini |

గుట్కా, పాన్ మసాలా, జర్థాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యసభలో హెల్త్ ​అండ్​ నేషనల్ ​సెక్యూరిటీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఎంపీ వద్దిరాజు కీలక ప్రసంగం
X

దిశ, తెలంగాణ బ్యూరో : గుట్కా, పాన్ మసాలా, జర్థాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, నోటి, గొంతు కేన్సర్ బారిన పడుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీస్ బిల్లు -2025పై రాజ్యసభలో మాట్లాడారు. పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులపై పెంచే సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు కూడా వాటా పంచుతామని ఈ బిల్లులో పేర్కొనడం శుభ పరిణామమన్నారు. యాలకుల పొడి,మౌత్ ఫ్రెషనర్స్ పేర్లతో పాన్ మసాలా, గుట్కాలు పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా టీ కొట్టు, పాన్ షాపుల్లో లభిస్తుండడం ఆందోళనకరమన్నారు. వీటి వాడకానికి అలవాటైన అల్పాదాయ వర్గాలు సరైన ఆహారం తీసుకోక అనారోగ్యానికి గురవుతున్నారని, తమ పిల్లలను చదివించ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని, వీరిలో అత్యధికులు మహిళలు, బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు చెందిన వారేనన్నారు. గుట్కాలు, పాన్ మసాలా, బీడీ పరిశ్రమల్లో పనిచేసే వారిలో చాలా మంది నోటి, గొంతు కేన్సర్ బారిన పడి హైదరాబాద్ లోని ఏంఏన్జీ ఆస్పత్రిలో చేరుతున్నారని చెప్పారు. అందులో చేరే ప్రతి వంద మందిలో 16 మంది నోటి, గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న వారేనని పేర్కొన్నారు.

ఇది జాతీయ సగటు కంటే కూడా ఎక్కువ అని, 2030 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు ఉత్పత్తులపై 75 శాతం సుంకాలు విధించాలన్న నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. సెస్ ద్వారా వచ్చే ఆదాయంతో పొగాకు ఉత్పత్తుల వ్యసనాలకు గురైన వారి కోసం డీ అడిక్షన్ కేంద్రాలు మరిన్ని నెలకొల్పాలని, స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ, ఉచితంగా ఆరోగ్య సేవలందించాలని కోరారు. పొగాకు ఉత్పత్తుల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలపై మరింత ప్రచారం అవసరమని స్పష్టం చేశారు. సెస్ పెంపుదల వల్ల బీడి కార్మికులకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, వారికి ఉపాధి మార్గాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఒక్కొక్కరికి లక్షన్నర రూపాయలు గ్రాంటుగా ఇవ్వాలని సూచించారు. ఆహారశుద్ధి కర్మాగారాల్లో వారికి ఉద్యోగాలివ్వాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలని, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించి ఆదుకోవాలని కోరారు. ప్రజలు కేన్సర్ బారిన పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా, అనారోగ్యానికి గురైన వారకి నేరుగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు తెలిపారు.

Next Story