- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సభకు ఎందుకు రావడం లేదో BRS సమాధానం చెప్పాలి.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి చిట్‌చాట్
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలను హాజరుకాకపోవడంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలను హాజరుకాకపోవడంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సభకు గైర్హాజరు కావడం, ప్రజా సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చ జరగాలని బీఏసీ (BAC)లో బీఆర్ఎస్ పట్టుబట్టిందని, తీరా ప్రభుత్వం చర్చకు సిద్ధమైతే సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు భయపడి పారిపోయారని విమర్శించారు. వాళ్లకు ఇబ్బంది అనిపించిన రోజున వాకౌట్ చేశారంటే అర్థం ఉంది, కానీ మిగతా రోజులు సభకు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలి ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని ధ్వజమెత్తారు.
కవిత ప్రతి మాట సభలో రికార్డ్ అయింది..
శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) భావోద్వేగానికి గురవ్వడంపై భట్టి స్పందిస్తూ.. ఆమె మాట్లాడిన ప్రతి మాట సభ రికార్డు అయిందని తెలిపారు. సభలో జరిగిన పరిణామాలను ప్రభుత్వం గమనిస్తోందని, నిబంధనల ప్రకారమే చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ రాష్ట్రాలపై భారం వేస్తుంటే, దానిపై చర్చించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా అని ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకం బీఆర్ఎస్ కు ఇంపార్టెంట్ కాదా.. అసలు పేదల సమస్యలను మీరు గుర్తించారా లేదా.. చర్చలో పాల్గొనకుండా సభను బహిష్కరించడం అంటే ప్రజలకు అన్యాయం చేయడమేనని భట్టి అన్నారు. సభ ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చించాలి అనేది పూర్తిగా స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలపై ఏ సమయంలోనైనా చర్చకు సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ తన వైఖరిని మార్చుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హితవు పలికారు.






