KTR: కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనవద్దు.. కేటీఆర్ సంచలన ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-04-03 05:33:38  IST  )

కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR: కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనవద్దు.. కేటీఆర్ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కంచగచ్చిబౌలి భూములను (Kancha Gachibowli Lands) వెనక్కి తీసుకుంటామని అక్కడ ఒక్క ఇంచు స్థలం కొనుగోలు చేసినా నష్టపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆ 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్ గా ప్రకటించి హైద్రాబాద్ లోనే బెస్ట్ ఎకో పార్క్ తయారు చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి (HCU) కానుగా ఇస్తాం. ఇది మా పెద్దలు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అని వెల్లడించారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఈ భూముల విషయం రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ భూములు హైదరాబాద్ ప్రజలకు చెందినవని ఇది హైదరాబాద్ భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటం అన్నారు.

కాంగ్రెస్ విధానమేంటో వెల్లడించాలి:

యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ భూములను కాపాడి హైదరాబాద్ కు మణిహారంగా ఉండేలా ఏకోపార్క్ అభివృద్ధి చేయడం బీఆర్ఎస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మరి కాంగ్రెస్ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెరలేపామని హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందన్నారు. రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన, ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కోర్టులంటే గౌరవం లేదని కోర్టులు చెప్పినా వినకుండా అర్థరాత్రులు చెట్లను నరికివేస్తున్నారని ఆరోపించారు. ఇవి నిజంగా ప్రభుత్వ భూములే అయితే దొడ్డితారిలో ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మంత్రులు తెలిసి తెలియక మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి మెప్పుకోసం మాట్లాడేవారితో మాకెలాంటి ఫికర్ లేదన్నారు. ప్రభుత్వం ఏదైనా నిర్మించాలనుకుంటే ఫోర్త్ సిటీలో నిర్మించాలన్నారు.

Next Story