BRS: విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు

by Gantepaka Srikanth |

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.

BRS: విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సోమవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలకు హాజరయ్యే ముందు గన్‌పార్క్ వద్ద ఫ్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ నినాదాలు చేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోనూ ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టే విద్యార్థుల జీవితాలతోనూ చెలగాటం ఆడుతున్నదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో రాక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పథకాన్ని కేసీఆర్ కొనసాగించారని.. విద్యార్థుల బంగారు బాటకు మార్గం చూపించారని తెలిపారు. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం పేద విద్యార్థులకు చదవును దూరం చేస్తున్నదని ఆరోపించారు. రూ.12 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story