- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: బీఆర్ఎస్ కు ‘కారు’ కష్టాలు.. నిన్న ఈ -కార్ రేస్ కేసు, నేడు లగ్జరీ కార్స్ ఇష్యూ.. కేటీఆర్ అరెస్టు తప్పదా?
కారు గుర్తు పార్టీని కార్ల వివాదాలు ఇరుకున పెడుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం దూరం అయ్యాక బీఆర్ఎస్ (BRS) పార్టీని కష్టాలు వీడటం లేదు. వరుస వివాదాలు, కేసులు, సొంత పార్టీలో అసమ్మతి పోటుతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఆ పార్టీకి తాజాగా కొత్త టెన్షన్ చుట్టుముట్టింది. లగ్జరీ కార్ల వ్యవహారం (Luxury cars) ఇప్పుడు బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఎప్పుడేం జరగబోతోందో అనే టెన్షన్ ఆ పార్టీ క్యాడర్ ను వెంటాడుతుండగా తాజాగా ఇంపోర్టెడ్ లగ్జరీ కార్ల వ్యవహారం సమస్యగా మారింది.
కాంగ్రెస్, బీజేపీ మధ్యలో బీఆర్ఎస్:
రాష్ట్రంలో ఇటీవల రాజకీయం ఆసక్తిని రేపుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య సై అంటే సై అనేలా రాజకీయ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రత్యర్థులపై వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ టార్గెట్‍గా కాంగ్రెస్, బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు ఇంట్రెస్టింగ్‍గా మారుతున్నాయి. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ- కార్ రేస్‍లో (Formula E-Car Race) అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ కేసు నమోదు చేసింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏసీబీ నివేదిక విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. దీంతో ఈ కేసులో కేటీఆర్ (KTR) అరెస్టు తప్పదా అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. కేటీఆర్ టార్గెట్‍గా బండి సంజయ్ లగ్జరీ కార్ల వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేశారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ అలీ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ కార్లలోనే కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు అనుమానించాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా బండి సంజయ్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. వాస్తవాలు రాబట్టేందుకు ఈ విషయంలో ఎంక్వైరీ జరగాలని బండి సంజయ్ కోరడంతో ఈ పరిణామం మరింత పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇప్పటికే ఈ-కార్ రేస్ కేసు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉండగా తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ లగ్జరీ కార్ల విషయంలో కేటీఆర్‍ను టార్గెట్ చేయడంతో బీఆర్ఎస్ కు కొత్త సమస్యలు సవాలుగా మారాయనే టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ రౌండప్:
రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే ఏడాది కాలం అత్యంత కీలకం కాబోతోంది. జూబ్లీహిల్స్ బై పోల్, స్థానిక సంస్థల ఎన్నికలు, కవిత రాజీనామా ఆమోదం పొందితే ఆక్కడ బై పోల్ జరగాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో వరుసగా ఎన్నికల సీజన్ నడవనుంది. బీఆర్ఎస్ కు చెక్ పెట్టడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ పార్టీని పూర్తిగా దెబ్బకొట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే కాళేశ్వరం కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ లో అరెస్ట్ అయిన బసరత్ ఖాన్ వ్యవహారం తెరపైకి రావడంతో వరుస కేసులతో బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ సర్కార్ చేతుల్లో రౌండప్ అవుతోందనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త కష్టాలను కారు గుర్తు పార్టీ ఈ కార్ల (Car controversy) సమస్యను ఎలా అధిగమించబోతోందో చూడాలి మరి.






