BRS: కొత్తగూడెం మేయర్ పోస్టు.. సీపీఐకి బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్

by Prasad Jukanti |   (  Updated:2026-02-13 12:12:15  IST  )

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ మంచి ఫలితాలు సాధించాయని కేటీఆర్ అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐకి కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

BRS: కొత్తగూడెం మేయర్ పోస్టు.. సీపీఐకి బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. 117 స్థానాల్లో మాకు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‍కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తేల్చి చెప్పారన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీటియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని పల్లే, పట్టణ ప్రజలు తేల్చారన్నారు. ఈ ఎన్నికల్లో సాధించిన ఉత్సాహంతోనే రాబోయే జడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలబడతామన్నారు. ఈ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ స్పష్టమైన గెలుపొందామని, మరో 30 స్థానాల్లో హంగ్ ఉందని వీటిల్లో ఎలా వ్యహరించాలనేది స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. గద్వాలలో నాలుగు సార్లు రీకౌంటింగ్ చేసి చివరికి ఒక్క ఓటుతో గెలిచామని చెప్పుకుంటున్నామన్నారు.

సీపీఐకి ఓపెన్ ఆఫర్:

ఈ సందర్భంగా సీపీఐకి కేటీఆర్ అన్ కండిషనల్‍గా ఓఫెన్ ఆఫర్ ప్రకటించారు. కొత్తగూడెం కార్పొరేషన్‍లో హంగ్ పరిస్థితి ఏర్పడటంతో ఇక్కడ మేయర్ సీటు కోసం సీపీఐకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. సింగరేణి బొగ్గుకుంభకోణం మేము భయటపెట్టాక పెద్దపల్లి జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్‍కు సీపీఐ బహిరంగంగా మద్దతు ఇచ్చిందని దాంతో కొత్తగూడెంలో సీపీఐకి మేము మద్దతు ఇచ్చేందుకు సిద్ధమేనన్నారు. ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో సైతం మాట్లాడానన్నారు. కాంగ్రెస్, బీజేపీని నిలువరించడం కోసం ఈ నిర్ణయాంతో ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు.

రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణం:

కొత్తగూడెంలో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్, సీపీఐకి చెరో 22 స్థానాలు ఉన్నాయి. మిగతా చోట్ల బీఆర్ఎస్ 8, బీజేపీ1, సీపీఎం 1, స్వతంత్రులు 6 చోట్ల గెలుపొందారు. ఇక్కడ కూనంనేని, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికీ చెరో ఎక్స్ అఫీషియోతో ఉపయోగించుకున్నా హంగ్ పరిస్థితే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫర్ తో సీపీఐ కోర్టులో బంతి ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఆఫర్ ను సీపీఐ అంగీకరిస్తే తెలంగాణ రాజకీయాల్లో ఇదో సరికొత్త సమీకరణంగా మారుతుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు లేదా ఫ్రెండ్లీ పోటీలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ తో జత కడితే ఇది ఆసక్తికర పరిణామంగా మారనుంది.

Next Story