ఏపీ లీడర్లకు బీఆర్‌ఎస్​ ఆఫర్లు? సీన్‌లోకి కేసీఆర్!

by Disha Web Desk 4 |
ఏపీ లీడర్లకు బీఆర్‌ఎస్​ ఆఫర్లు? సీన్‌లోకి కేసీఆర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించడంలో భాగంగా ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలయ్యాయి. రెండు రోజుల క్రితం ముగ్గురు కేంద్ర సర్వీసుల మాజీ అధికారులను పార్టీలోకి చేర్చుకున్న బీఆర్ఎస్ అధినేత మరింత దూకుడు ప్రదర్శించాలనుకుంటున్నారు. ఇందుకోసం వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ స్వయంగా కొద్దిమందితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న పరిచయాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన తదితర పార్టీలతో సంబంధం లేకుండా నేతలతో గతంలో ఉన్న రిలేషన్స్, ప్రస్తుతం ఆయా పార్టీల్లో వారి పరిస్థితికి అనుగుణంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు.

ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారిపై ఫోకస్ పెట్టినా.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని నేతలనూ గులాబీ బాస్ కదిలిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. ఆయా పార్టీల్లో పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్‌లో చేరడం ద్వారా ఒనగూరే ప్రయోజనం, రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం, గెలిపించుకోడానికి పార్టీ నుంచి తగిన సహకారం అందించడం.. ఇలా అంశాలన్నింటినీ ఆ నేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం. తమ పార్టీలో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కమిటీ ఏర్పాటు చేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు. ఇలాంటి పలు అవకాశాలు లభిస్తాయని కేసీఆర్ వారికి నచ్చచెప్తున్నట్టు తెలిసింది.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు వేర్వేరుగా ఉన్నా ఇప్పటికీ హైదరాబాద్‌తో రకరకాలుగా సంబంధాలు ఉన్న నేతలపై కేసీఆర్ ఎక్కువ దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాలు ఉదహరించాయి. హైదరాబాద్ నగరంతో ఉన్న బంధుత్వం, వ్యాపార సంబంధాలు, పరిశ్రమలు తదితరాలన్నింటిపై కేసీఆర్ దగ్గర స్పష్టమైన సమాచారం ఉండడంతో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని వారిని బీఆర్ఎస్‌లోకి స్వాగతించాలని భావిస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్నందున బీఆర్ఎస్‌లో చేరడం ద్వారా వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే అభిప్రాయం కూడా పార్టీ మార్పులో కీలక భూమిక పోషిస్తున్నట్టు సమాచారం.

మరి కొందరికి ఆర్థికపరంగా సాయం చేయడం, హైదరాబాద్‌లో బిజినెస్‌కు సపోర్టు లభిస్తుందని కేసీఆర్ హామీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తొలి ప్రయత్నంలో ముగ్గురు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు చేరినందున రానున్న కాలంలో ఇలాంటి చేరికలు మరిన్ని ఉంటాయనే ధీమా బీఆర్ఎస్‌లో వ్యక్తమవుతున్నది. ఏ పార్టీ నుంచి వస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా ఏపీలోనూ బీఆర్ఎస్‌కు తగినంత సంఖ్యలో లీడర్లు, కేడర్ ఉన్నదనే ఇమేజ్‌ను నెలకొల్పడంపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టారు.

Also Read...

కేసీఆర్​వ్యాఖ్యలు... ఉత్తరాంధ్ర నాయకుల్లో కలవరం


Next Story